Nirjala Ekadashi 2023 : భీముడికి వ్యాసుడు చెప్పిన వ్రతం

ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi 2023)..  అత్యంత పవిత్రమైనది.

  • Written By:
  • Updated On - May 23, 2023 / 01:42 PM IST

ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi 2023)..  అత్యంత పవిత్రమైనది. ఈ వ్రతం పాటించే వారు చుక్క నీరు కూడా తీసుకోరు. వ్రతం చేపట్టిన రోజున సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు తాగరు. అందుకే దానికి నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi 2023)  అనే పేరు వచ్చింది. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈసారి నిర్జల ఏకాదశి వ్రతాన్ని మే 31న(బుధవారం)  పాటిస్తారు. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశిని జరుపుకుంటారు. దీనిని భీమసేన్  ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసం వల్ల దీర్ఘాయుష్షు, మోక్షం లభిస్తాయి. 

శుభ ముహూర్తం 

నిర్జల ఏకాదశి తిథి మే 30న మధ్యాహ్నం 01:07 గంటలకు ప్రారంభమై మే 31న  మధ్యాహ్నం 01:45 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. సర్వార్థ సిద్ధి యోగ సమయం మే 31న ఉదయం 05.24 నుంచి 06.00 గంటల వరకు ఉంటుంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని  జూన్ 01 న ఉదయం 05.24 నుంచి 08.10 మధ్య విష్ణుమూర్తికి పూజ చేసి ముగిస్తారు. 

పూజా విధానం 

నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీని తరువాత పసుపు బట్టలు ధరించి విష్ణువును పూజించి..  ఉపవాస వ్రతం చేయాలి. విష్ణువుకు పసుపు పువ్వులు, పంచామృతం, తులసీ దళాన్ని సమర్పించాలి. విష్ణువు, లక్ష్మిదేవి  మంత్రాలను జపించండి. ఉపవాస వ్రతం చేసిన తర్వాత, మరుసటి రోజున  సూర్యోదయం వరకు చుక్క నీరు కూడా తీసుకోవద్దు. ఆహారం, పండ్లు కూడా వ్రతం  పాటించే వారు తినకూడదు. మరుసటి రోజు అంటే.. ద్వాదశి తిథి నాడు స్నానం చేసి శ్రీ హరిని  పూజించిన తరువాత ఆహారం, నీరు తీసుకొని ఉపవాసం విరమించాలి.

పుణ్య ఫలాలు ఇవీ..

ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే రోజున ఆహారం, నీరు, బట్టలు, పాదరక్షలు, గొడుగు, పండ్లు మొదలైన వాటిని దానం చేయాలి. ఈ రోజున నీటి కలశాన్ని దానం చేసే భక్తులకు ఏడాది పొడవునా ఏకాదశి ఫలాలు లభిస్తాయి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల.. ఇతర ఏకాదశులలో భోజనం చేసిన దోషం తొలగిపోయి అన్ని ఏకాదశుల పుణ్యఫలం చేకూరుతుంది. ఈ పవిత్ర ఏకాదశిని నిష్ఠతో ఆచరించేవారు పాపాల నుంచి విముక్తులు అవుతారు.

చేయవలసినవి.. చేయకూడనివి..

1. నిర్జల ఏకాదశి రోజున ఇంట్లో  అన్నం వండకూడదు.
2. ఏకాదశి తిథి నాడు తులసి ఆకులను తీయకండి. అయితే మీరు ఒక రోజు ముందే వాటిని తీసి సిద్ధంగా ఉంచుకోవచ్చు.
3. నిర్జల ఏకాదశి రోజున శారీరక సంబంధాలను నివారించండి.
4. ఈ రోజున ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యం సేవించవద్దు.
5. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. కోపం తెచ్చుకోకండి.

నిర్జల ఏకాదశి కథ ఇదీ..  

మహాభారత కాలంలో ఒకసారి భీముడు, మహర్షి వేద వ్యాసుడితో .. ” నా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజున  ఉపవాసం ఉండమని నాకు కూడా చెబుతారు. కానీ నేను ఆకలితో ఉండలేను. కాబట్టి దయచేసి నాకు ఆ పుణ్య ఫలం పొందే మార్గం చెప్పండి”  అని అడిగాడు . దీనిపై వేదవ్యాసుడు ఇలా అన్నాడు..  “మీరు నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఆ  రోజు ఆహారం, నీరు రెండూ  తీసుకోవద్దు. ఆ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసంపాటిస్తే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలాలను పొందుతావు” అని సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి నిర్జల ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది.