Site icon HashtagU Telugu

Gita Jayanti : గీతా జయంతి ఎప్పుడంటే ? భగవద్గీత ప్రాముఖ్యత ఇదే !

Bhagwat Geeta

Bhagwat Geeta

హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో గీతా జయంతి  కూడా ఒకటి. భగవద్గీత పుట్టిన రోజుగా ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. ప్రతియేటా మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గీతా జయంతి ఎప్పుడు? గీతా జయంతి 2025 తేదీ, తిథి, గీతా జయంతి విశిష్టత వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం..

హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతి జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం.. మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతిని జరుపుకొంటారు. భగవద్గీత  అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది.

మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి నవంబర్ 30వ తేదీ రాత్రి 9:29 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7:00 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి జరుపుకోవాల్సి ఉంటుంది. పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే.. భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని, జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం. ఈరోజున ఓం కృష్ణాయ నమః లేదా ఓం శ్రీ కృష్ణ శరణం మమ.. అనే మంత్రాలను జపించడం శుభప్రదం.

గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవ రాజు అయిన ధృతరాష్ట్రుడికి సంజయుడు వినిపించాడట. ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడినా నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర గ్రంథం నేటికీ ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది.

సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కాబట్టి ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలు ఉన్నాయి. భగవద్గీతను వాడుకలో గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారు. సనాతన ధర్మం, పురాతన గ్రంథాల ప్రకారం ద్వాపర యుగంలో మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధనలు బోధించాడట. కాబట్టి ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశీర్షం శుక్ల పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు.

పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు. అర్జునుడు సైతం మానసికంగా కుంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని, మన జన్మ కర్మ సిద్దాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో, ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడం ఎలాగో వివరించాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి. జీవితంలో సానుకూలతను కలుగజేస్తాయి.

Exit mobile version