Site icon HashtagU Telugu

Diparadhana: దీపానికి ఎటువంటి కుందులు వాడాలి.. వాటితో ఎటువంటి ఫలితం లభిస్తుందంటే?

Diparadhana

Diparadhana

సాధారణంగా దీపారాధన చేసే సమయంలో చాలా మందికి అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. దీపారాధన ఎన్ని వత్తులతో చేయాలి. ఎటువంటి నూనె పోయాలి. ఎలాంటి కుందులు వాడాలి.. అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మూడు వత్తులు వేసి వెలిగించాలి. ఒంటి దీపం,రెండు వత్తుల దీపాలు వెలిగించరాదు. మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాల్లోని అంథకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా మారుస్తుంది.

అయితే దీపం వెలిగించే నూనె, నెయ్యి మాత్రమే కాదు ప్రమిదను బట్టి కూడా ఫలితం మారుతుంది. బంగారు ప్రమిదను గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ఇలా చేస్తే ధనసమృద్ధి, విశేష బుద్ధి లభిస్తుంది. అలాగే వెండి ప్రమిదను బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే సంపద వృద్ధి చెందుతుంది. రాగి ప్రమిదని ఎర్రని కందిపప్పు పై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి, నువ్వుల నూనెతో దక్షిణాభి ముఖంగా వెలిగిస్తే మనోబలం కలుగుతుంది.

కంచు లేదా ఇత్తడి ప్రమిదను శనగపప్పు పై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తులసి మొక్క వద్ద వెలిగిస్తే దుష్టశక్తుల నాశనమై, సకలపాపాలు నశిస్తాయి. పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం చేకూరుతుంది.అమావాస్య రోజు రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు. ఆవనూనెతో రావిచెట్టు క్రింద 41 రోజులు దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. నువ్వుల నూనెతో 41 రోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు నశించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే గురువారం రోజు అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు వివాహ ప్రాప్తి కలుగుతుంది. దేవుడికి దీపారాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ ప్రమిదలో వెలిగించినా, ఏ ముఖంగా వెలిగించినా దైవ పూజ వల్ల మంచే జరుగుతుంది.