Site icon HashtagU Telugu

Coconut on URN : కలశం పై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి?

Coconut Place On Urn

Coconut Place On Urn

నోములు, వ్రతాలు, ప్రత్యేక పూజల సమయాల్లో కలశ పెట్టి పూజ చేస్తుంటారు. ఆ కలశని అమ్మవారిగా భావించి షోడశోపచార పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. మరి పూజయ్యాక ఆ కొబ్బరికాయ (Coconut) ఏం చేయాలి? కలశపై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి? కొట్టుకుని తినొచ్చా? వంటల్లో వినియోగించవచ్చా? దేవుడి దగ్గర నుంచి తీసేసిన పూలతో పాటూ తీసుకెళ్లి నీటిలో వేయాలా? ఇలా కలశపై పెట్టిన కొబ్బరికాయ గురించి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఇంతకీ ఆ కొబ్బరికాయను ఏం చేయాలంటే..

కలశపై పెట్టిన కొబ్బరికాయ (Coconut) భగవంతుని స్వరూపానికి  ప్రతీక.  కాయపై ఉండే పొర – చర్మం, పీచు – మాంసం , దృఢంగా ఉండే చిప్ప- ఎముకలు, లోపల ఉండే కొబ్బరి -మనిషిలోని ధాతువు, కాయలోని నీళ్లు – ప్రాణాధారం, పైన ఉండే మూడు కన్నులే – ఇడ, పింగళ, సుషుమ్న నాడులు, జుట్టు- అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం. వెండి చెంబు, రాగి చెంబు, ఇత్తడి చెంబు..ఎవరి వీలుని బట్టి వారు ఆ చెంబుకి పసుపు రాసి, బొట్లు పెట్టి.. ఆపై కొబ్బరి కాయ పెట్టి చుట్టూ మామిడి ఆకులు, పైన వస్త్రంతో అలంకరిస్తారు.  అప్పుడు అది పూర్ణకుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది.

కలశ స్థాపన వెనుకున్న పురాణగాథ:

సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్నాడు. నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ.. ప్రపంచాన్ని సృష్టించాడు. తొలుత కలశస్థాపన చేసి అందులో నీరు పోశాడని..అదే సృష్టి ఆవిర్భావానికి ప్రతీకగా నిలిచిందని చెబుతారు. ఇక కలశంలో ఉంచిన ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. దానికి చుట్టే దారం..సృష్టిలో అన్నింటినీ బంధించే ‘ప్రేమ’ను సూచిస్తుంది. అందుకే కలశాన్ని శుభసూచనగా పరిగణిస్తారు. అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానం, దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించిన తర్వాత అందులోని నీరు అన్ని వైదికక్రియలకి వినియోగిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో  భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ‘కలశం’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

కలశను పూజచేయడానికి వచ్చిన వారికి దానం ఇవ్వొచ్చు..దీన్ని పూర్ణఫల దానం అని అంటారు. ఇంట్లో పూజల సమయంలో కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగించుకోవచ్చు…ఏం జరుగుతుందో అనే భయం ఉన్నవారు పారే నీటిలో వేయవచ్చు. అంతేకానీ కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగిస్తే ఏదో జరిగిపోతుందేమో అనే ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు కొందరు పండితులు.

కొబ్బరికాయ (Coconut) కుళ్లితే?

ఇక పూజలో వినియోగించే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగానే ఉంటే పర్వాలేదు కానీ కుళ్లితే మాత్రం కంగారుపడిపోతారు. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. అయితే భయపడాల్సింది ఏమీలేదంటారు పండితులు. కొబ్బరికాయ కుళ్లితే పూజలో ఏదో అపచారం జరిగినట్టు భావించాల్సిన అవసరం లేదంటారు. కలశలోనీటితో దేవుడి మందిరాన్ని, మిమ్మల్ని ప్రక్షాళన చేసుకుని మరో కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. ఇక వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దిష్టిపోయిందని భావించాలి కానీ ఏదో అపశకునంగా ఫీలవ్వాల్సిన అవసరం లేదంటారు.

Also Read:  Kitchen Tips : వంటింట్లో ఈ వస్తువులు ఉంచకూడదు..