హిందూ మతం ప్రకారం శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజున శనీశ్వరుడితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున మనం చేసేటటువంటి పరిహారాలు పూజలు దానధర్మాలు మంచి ఫలితాలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే గ్రహాల గమనం వలన ఏలినాటి శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మనం అనుకున్న పనులు ఆలస్యం కావడం కానీ, ఆరోగ్య సమస్యలు ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పెద్ద సమస్యలు కానప్పటికీ, మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయట.
కాగా వారంలో ఏడో రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైనది అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు. అలాగే చాలా మంది శని దేవుని పేరు చెబితే భయపడిపోతుంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు. కానీ మనం అనుభవించే కష్ట సుఖాలు మనం చేసిన కర్మల ఆధారంగా వస్తాయి కానీ, శని వలన కాదన్న విషయాన్ని గ్రహించాలి. నిజాన్ని శని కష్టాలను ఇవ్వడం ద్వారా మన పాపాలను తొలగించి పునీతుల్ని చేస్తాడట. అదేవిధంగా ఏలినాటి శని, అర్దాష్టమ శని, అష్టమ శని ప్రభావం వలన కలిగే చెడు ఫలితాలను తగ్గించడానికి శనివారం కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని చెబుతున్నారు.
కాగా శనివారం రోజు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తే మంచి జరుగుతుందట. అదేవిధంగా శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి బెల్లం నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. ఈ నైవేద్యాన్ని పొరపాటున కూడా ఇంటికి తీసుకెళ్లకూడదట. అలాగే నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలని ఇలా చేయడం వల్ల శని అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెబుతున్నారు. అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన కూడా శని అనుగ్రహం కలుగుతుందట. ఈరోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి కోరిక కోరితే అది నెరవేరుతుందట. అలాగే శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని చెబుతున్నారు. శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి. వీలుంటే హనుమంతునికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయట. శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయట. శనివారం శివాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.