హిందువులు తెలుగు మాసాలలో శ్రావణ మాసాన్ని ముఖ్యమైనదిగా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. కాగా ఈ మాసంలో స్త్రీలు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతం మంగళ గౌరీ వ్రతం, అంటూ నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణమాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి? ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మంగళగౌరీదేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదట. సర్వవిధ సౌభాగ్యాలతో వారు అలరారుతుంటారని పండితులు చెబుతున్నారు.
అందుకే పెళ్ళయిన ప్రతి మహిళ శ్రావణ మంగళవారాల నోము నోచుకోవడం అనాదిగా వస్తోంది. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఆవునేతిలో మంగళగౌరి ఉంటుంది. అందుకే వాటినన్నింటినీ ఈ వ్రతానికి ఇవన్నీ తప్పకుండా ఉపయోగిస్తారు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలలో చేస్తారు. కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తారు. ఈ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి మంగళగౌరి వ్రతానికి కావలసిన పూలు, పళ్ళు, శనగలు, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు మొదలైన సామగ్రిని సమకూర్చుకోవాలి.
తర్వాత పసుపురాసిన దారానికి పువ్వులు, మాచుపత్రి కానీ, దమనం కానీ కట్టి తోరణాలు తయారు చేస్తారు. వాటిని పూజచేసేటప్పుడు గౌరీదేవి మీద పెట్టి పూజ అయిన తర్వాత ఒకటి గౌరీ దేవికి ఉంచి, రెండు తీసి ఒకటి ముత్తైదువుకు వాయనంగా ఇస్తారు. ఇక ముత్తైదువులకు వాయనం ఇచ్చినప్పుడు సౌభాగ్య ప్రదాయిని శ్రావణ గౌరి “సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ॥ శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే” అని అమ్మవారిని ఆరాదిస్తారు. అయితే నూతన వధువులు సౌభాగ్య సిద్ధి కోసం ఈ మాసంలోనే అమ్మలగన్న అమ్మ పెన్నిధులిచ్చెడి కల్పవల్లి అయిన మంగళ గౌరీ, వరలక్ష్మీ వ్రతాల్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయంగా చెప్పవచ్చు. మంగళగిరి వ్రతాన్ని జరుపుకుంటే మంచి భర్త వస్తాడని అమ్మాయిలు విశ్వసిస్తూ ఉంటారు. కాగా పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం పొందిన అర్ధనారీశ్వరి. శ్రావణ మంగళవారం గౌరీపూజ చేసేవారికి సౌభాగ్యం కలుగుతుందనీ ఇష్టకామ్యార్ధసిద్ధి ప్రాప్తిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయట.