Site icon HashtagU Telugu

Shravan Masam: శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?

Shravan Masam

Compressjpeg.online 1280x720 Image

Shravan Masam: ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు. తిరిగి శ్రావణ మాసం (Shravan Masam)లో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. తెలుగు క్యాలెండర్‌లో ప్రతి నెలకో ప్రాముఖ్యం.. ప్రాధాన్యం విశిష్టత ఉన్నాయి. చైత్రమాసం ప్రారంభంతో ఉగాది (తెలుగు సంవత్సరాది) జరుపుకుంటే ఆ వెంటనే శ్రీరామ నవమి తర్వాత వివాహ వేడుకలకు భారతీయులు ప్రత్యేకించి హిందువులు శ్రీకారం చుడతారు. ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు.

తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. శీతాకాలం ప్రారంభంలో వచ్చే కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకత ఉన్నట్లే శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉన్నదంటే అతిశయోక్తి కాదు. కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమో, శ్రావణమాసం లక్ష్మీపార్వతులకి అంత ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో మహిళామణులు ప్రతి మంగళవారం గౌరీదేవిని పూజిస్తుంటారు. మంగళ గౌరి ఆరాధనలో భాగంగా నోములు, వ్రతాలు చేస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ఆ తల్లి రక్షిస్తూ ఉంటుందని ఆడబడుచుల విశ్వాసం.

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా పర్వ దినాలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము.

ఈ మాసంలో రవి సంచరించు నక్షత్రాల ప్రభావంతో చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది. చంద్రుని చార నుంచి జరగబోయే దుష్ఫలితాల నివారణకు, మంచి చేయడానికి, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణమాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశం.

Also Read: Cow Milk: ఆవుపాలు తాగితే బరువు తగ్గుతారా.. ఇందులో నిజమెంత?

శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనం, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు.

శ్రావ‌ణ‌మాసంలోనూ కూడా వివాహాలు ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్ళికూతుళ్లతో అత్తలు ఈ వ్రతం చేయిస్తారు. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం, వాటి ప్రాముఖ్యం తెలుస్తుంది. శ్రావణ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఈ వ్రత కథలో చారుమతికి అనే స్త్రీ అందరితో అణకువగా ఉంటుందని, అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీ దేవి కటాక్షం కలిగిందని చెబుతారు. అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటూ, అత్తమామలను అందరిని ఆదరించాలని, అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని, కొత్త కోడలికి తెలుస్తుంది.

ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు, మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి.

Exit mobile version