Site icon HashtagU Telugu

pradakshina : ఆలయాల్లో చేసే ప్రదక్షిణ అంటే ఏమిటి?.. ఎన్ని రకాలు తెలుసుకుందాం..!

What is Pradakshina done in temples? Let's find out how many types there are..!

What is Pradakshina done in temples? Let's find out how many types there are..!

pradakshina : సనాతన ధర్మంలో ఆలయాలను దర్శించినపుడు నేరుగా దైవదర్శనం చేయకుండా ప్రదక్షిణ చేయడం ఆచారం. ఆలయానికి చేరుకోగానే భక్తులు అక్కడి ఏర్పాటును అనుసరించి ప్రదక్షిణలు చేస్తారు. ఆలయంలో కొలువైన దైవాన్ని స్మరిస్తూ, ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ తాము అనుకున్న సంఖ్య ప్రకారం ప్రదక్షిణలు చేస్తారు. మెల్లగా నడవటం, మనసులోకి ఇతరమైన ఆలోచనలు రానివ్వకపోవటం, చేతులు జోడించి నమస్కరించటం ప్రదక్షిణలో ప్రధాన అంశాలు. ఇంట్లో నిత్యవిధుల్లో భాగంగా చేసే పూజ పూర్తయిన తర్వాత ఆత్మప్రదక్షిణ తప్పనిసరిగా చెయ్యాలి. ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు.

Read Also: New EPFO Rules: పీఎఫ్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఇక‌పై!

ఏ దేవాలయంలో ఏ దేవుడి, దేవతలను ప్రధానంగా ప్రతిష్టించారో వారినే ధ్యానించాలి. విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు. ప్రత్యేక క్రతువు సాగుతుంది. ఎంతో శ్రమకోర్చి జపతపాదులు, హోమాలు, అనుష్టానాలు చేసి విగ్రహాన్ని మంత్ర యంత్ర బద్ధంగా ప్రతిష్టిస్తారు. ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉన్న దివ్య తేజస్సు, శక్తి నలువైపులా కాంతిపుంజంలా వ్యాపించి పరిసరాల్లో ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శక్తి మన శరీరాలను తాకి ఉపశమనాన్ని కలిగించి, మనోబలాన్ని ఇస్తుందంటారు.

ప్రదక్షిణలు ఎన్ని రకాలు..

ఆత్మ ప్రదక్షిణ: తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణ
పాద ప్రదక్షిణ: పాదాలతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణ
దండ ప్రదక్షిణ: దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణ
అంగ ప్రదక్షిణ: సాత్విక అవయవాలు నేలను తకేలా దొర్లుతూ చేసేవి.
గిరి ప్రదక్షిణ: దేవుడు కొలువుండే కొండ చుట్టూ చేసేది.

శివపురాణం ప్రకారం, శైవ ఆలయాల్లో కొన్ని నియమాల ప్రకారం మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. శివాలయాల్లో గజస్తంభం నుండి సోమ సూత్రం వరకు మాత్రమే ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు. ఈ సందర్భంగా సిద్ధాంతి శర్మ సుగుణ చార్యులు చెబుతూ.. ఆలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా, శివపరంపర ప్రకారం, వాటిని ఒక్కటిగానే పరిగణిస్తారని వివరించారు. అయితే ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా విధానాలు ఉన్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరికి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడు ఉన్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. దీనికే సోమసూత్ర ప్రదక్షిణం అనే పేరు కూడా ఉంది.శాస్త్రాలు, శివపురాణం ప్రకారం శివలింగానికి అర్ధ ప్రదక్షిణ చేస్తారు. అంటే సగం వరకు ప్రదక్షిణ చేసి మరల వెనుకకు తిరిగి ప్రదక్షిణ చేయాలి.

ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?

ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము. ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది.

ఇకపోతే..ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది.

‘ప్ర’ అనగా పాప నాశనమని,
‘ద’ అనగా కోరికలను నెరవేర్చుట అని,
‘క్ష’ అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అని
‘ణ’ అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించునదని అర్థం.

Read Also: CM Chandrababu: ఉమెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు కీల‌క‌ ప్రకటన