Bonalu: బోనం అంటే ఏంటి? ఎందుకంత ప్రత్యేకత!

తెలంగాణ ఆచార్య వ్యవహారాల్లో ముఖ్యమైన పండుగ బోనం. బోనం అంటే భోజనం. కొత్త కుండలో భోజనం వండి గ్రామ దేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెడతారు. ఈ బోనాన్ని నెత్తిపై మోసుకుంటూ జాతరగా వెళ్లి గ్రామ దేవతకు సమర్పిస్తారు. ముందు మెడలో వేప మండలు కట్టుకున్న వేటపోతులు తరలి వెళ్తుంటే.. వెనక వేపాకులు పట్టుకుని బోనం ఎత్తుకున్న మహిళలు జాతరగా తరలి వెళ్తారు. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, […]

Published By: HashtagU Telugu Desk
Bonalu

Bonalu

తెలంగాణ ఆచార్య వ్యవహారాల్లో ముఖ్యమైన పండుగ బోనం. బోనం అంటే భోజనం. కొత్త కుండలో భోజనం వండి గ్రామ దేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెడతారు. ఈ బోనాన్ని నెత్తిపై మోసుకుంటూ జాతరగా వెళ్లి గ్రామ దేవతకు సమర్పిస్తారు. ముందు మెడలో వేప మండలు కట్టుకున్న వేటపోతులు తరలి వెళ్తుంటే.. వెనక వేపాకులు పట్టుకుని బోనం ఎత్తుకున్న మహిళలు జాతరగా తరలి వెళ్తారు.

మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొందరు ఉల్లిపాయలతో చేసిన అన్నంను మట్టి, ఇత్తడి లేదా రాగి కుండల్లో పెట్టి, వాటికి బొట్లు పెడతారు. చేతిలో వేప ఆకులు పట్టుకుని బోనాన్ని తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో సంబరంగా అందరూ కలిసి జాతరగా గ్రామ దేవత వద్దకు బయలుదేరతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ లాంటి వివిధ పేర్లతో పిలిచే గ్రామ దేవతల కొలువుకు వెళ్లి బోనం సమర్పిస్తారు.

కొందరు బోనంతో పాటు సాక సమర్పిస్తారు. ఇలా బోనాలు సమర్పించడం వల్ల గ్రామ దేవతలు శాంతిస్తారని, అంటు వ్యాధులు రాకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బోనాల పండగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది.

ఆషాఢమాసంలో ఆడబిడ్డలను పుట్టింటికి తెచ్చుకుంటారు. ఇంటి ఆడబిడ్డ ఇళ్లకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందే. ఆషాఢమాసంలో గ్రామ దేవత పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. పుట్టింటికి వచ్చే గ్రామ దేవతకు తమ ఇళ్లల్లోకి సాదరంగా ఆహ్వానం పలుకుతారు భక్తులు. కూతురు ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని ఊరడి అంటారు. కొన్ని చోట్ల పెద్ద పండుగ, వంటల పండుగ గా పిలుస్తారు. ఇదే కాలక్రమంలో బోనాలుగా మారింది.

  Last Updated: 23 Jun 2023, 05:52 PM IST