Ugadi 2026 తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు.
Ugadi 2026
తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉగాది జరుపుకోబోతున్నారు. ఈ నెల 19 (గురువారం) తేదీన కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నూతన సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం కాగా.. పరాభవ అనగానే చాలామందికి ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. చాలామంది పరాభవం అంటే ఈ ఏడాది మొత్తం అవమానాలు ఎదురవుతాయా అంటూ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పరాభవ నామ సంవత్సరంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పరాభవ నామ సంవత్సరం గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
ఈ నెల 19న తెలుగువారికి పరాభవ నామ సంవత్సరం పరిచయం కాబోతోందని.. పరాభవ అంటే అవమానాలు ఎదురవుతాయని చాలామంది అనుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. పేరులోనే పరాభవం ఉండటంతో.. పరాభవ నామ సంవత్సరంలో పరాభవాలు అధికంగా ఉంటాయిని దాని అర్ధం కాదన్నారు. ‘పరాభవలో పరా అంటే పరా భట్టారిక(లలిత దేవి) భవ అంటే సాక్షాత్తు భవుడు, పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు, సామరస్య స్వరూపముతో, తమ బిడ్డలు రక్షిస్తారని అర్థం’ అని వివరించారు. పరాభ పేరుతో ఈ సంవత్సరం పేరు విని చాలామంది భయపడుతున్నారని.. ఎలాంటి ఆందోళన, భయం అవసరం లేదన్నారు. ‘పార్వతి పరమేశ్వరుని భక్తితో కొలుద్దాం.. సత్య, ధర్మ, భక్తి మార్గంలో ఉందాం. అమ్మవారి అయ్యవారి రక్షణ పొందడం కోసం, సకల శుభాల కోసం, ప్రశాంత జీవనం కోసం, పండితులు లోతుగా దీని అర్ధం తెలుసుకుని మనందరికీ తెలియజేసిన విషయం’ అని పరాభవ నామ సంవత్సరం గురించి వివరించారు.
Ugadi Parabhava Nama Samvatsara
పరాభవ సంవత్సరానికి మరో అర్ధం కూడా చెబుతున్నారు. ఈ పరాభవ తెలుగు పంచాంగం ప్రకారం 60 ఏళ్ల చక్రంలో 40వ సంవత్సరంగా వివరిస్తున్నారు. పరాభవం అనగానే ఓటమి, అవమానంగా భావించకూడదని.. జ్యోతిష్య శాస్త్ర పరం అర్ధం వేరేగా ఉందన్నారు. పరాభవంలో ‘పరా’ అంటే గొప్పది, అత్యున్నతమైనదిగా అర్ధం చెబుతున్నారు. ‘భవ’ అంటే పుట్టుక, స్థితి అని చెబుతున్నారు. ఈ రెండు కలిపితే (పరాభవ) గొప్ప స్థితిని పొందేది అంటూ వివరిస్తున్నారు. వాడుక భాషలో పరాభవం అనగానే ఓటమి, అవమానం అని చెబుతుంటారు. తెలుగు సంవత్సరానికి పరాభవ పేరు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం వేరు.
ఈ తెలుగు సంవత్సరంలో జన్మించేవారు, ఏవైనా పనులు చేసేవారు అహంకారాన్ని వదిలేసి, వినయంతో ఉంటారని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే అహంకారానికి ఓటమి, జ్ఞానం విజయం సాధించడమే అసలైన పరాభవం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు ధర్మంపై ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త మార్పులకు శ్రీకారం చుడతారు. పరాభవ నామ సంవత్సరంలో అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే మార్పులు మనిషిని మరింత దృఢంగా మారుస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరం 1966-67 మధ్య వచ్చింది.. మళ్లీ ఇప్పుడు 2026లో రాబోతోంది.
Ugadi 2026
