Site icon HashtagU Telugu

Arunachalam: అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

Mixcollage 15 Jul 2024 05 55 Pm 3149

Mixcollage 15 Jul 2024 05 55 Pm 3149

మనలో చాలామందికి అరుణాచలం గురించి తెలిసే ఉంటుంది. అరుణాచలం పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గిరిప్రదక్షిణ. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరుణాచలేశ్వరుడికి కూడా గిరిప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతోంది. అందుకే పరమశివుడు కూడా పార్వతీ దేవితో కలిసి సంవత్సరానికి రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడని పండితులు సైతం చెబుతున్నారు. గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడట. అలాగే గిరిప్రదక్షిణ చేసే వారి కోరికలను కూడా నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం.

ఈ కొండ చుట్టూ దూరం సుమారుగా 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయడం. అయితే ఈ గిరి ప్రదక్షిణ గురించి ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని అడిగిందట. అరుణాచలంలో ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి?అని అడిగగా.. దీనికి గౌతమ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్శితో ఇలా అంటాడటీ. భూలోకంలో నేను అరుఛాలేశ్వర రూపంలో వున్నాను. అందుకే దేవతలు, మునులు అక్కడకు వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు. నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతీ అడుగుకు వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయి. పుణ్య తీర్ధాల నుంచి వచ్చే ఎంతో పుణ్యము ఈ గిరి ప్రదక్షిణతో వస్తుంది. కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడు నా చుట్టూ తిరగడం వల్ల చాలా శక్తులను పొందగలుగుతాడు.

ఒక అడుగుతో భూలోక ప్రాప్తి, రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయి. రెండవ అడుగులో వాచిక పాపములు తొలగిపోతాయి. ఇక మూడవ అడుగులో శారీరక పాపాలు నశిస్తాయి. ఈ అరుణాచలం చుట్టూ మునులు సిద్ధ పురుషుల ఆశ్రమాలు వేలసంఖ్యలో వున్నాయి. నేను సిద్ధ స్వరూపముతో ఈ అరుణాచలంలో వుంటూ వారిని చూస్తున్నాను. ఈ అరుణాచలం తేజో స్థంభం. ఈ తేజో లింగాన్ని మనసున ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మ జన్మల పాపాలు నశిస్తాయి అని ఆ పరమేశ్వరుడు మహర్షితో అన్నారట. అయితే గిరిప్రదక్షిణ చేసే ముందు తప్పకుండా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలట. నుదుటిన విభూతి ధరించి రుద్రాక్ష మాలలు వేసుకోని, అరుణాచల శివ అంటూ నామస్మరణ చేసుకుంటూ గిరిప్రదక్షిణ చేయాలట.

మనసులో మరేమీ తలచకుండా కేవలం అరుణాచలుడిని మాత్రమే తలచుకొని ప్రదక్షిణ చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే గిరిప్రదక్షిణ చేస్తున్న సమయంలో మధ్యలో దానధర్మాలు చేయడం వల్ల దైవ శక్తిని పొందవచ్చట. ముఖ్యంగా సోమవారం రోజు ఈ గిరిప్రదక్షిణ చేయడం వల్ల జనన మరణ బాధల నుంచి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు పండితులు. మంగళవారం రోజు ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయట. అయితే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తొందర తొందరగా కాకుండా నెమ్మదిగా నిదానంగా నడుస్తూ గిరిప్రదక్షిణ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పండితులు.