Site icon HashtagU Telugu

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Vinayaka Chavithi

Vinayaka Chavithi

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు వినాయక చవితి కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై లాంటి పెద్ద పెద్ద సిటీలలో ఈ పండుగను మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు గణపతిని పూజిస్తారు. ఇళ్ళలో మాత్రమే కాదు అనేక చోట మండపాల్లో కూడా వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పుజిస్తారు. వీధుల్లో భారీ గణనాథుల విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ వినాయక చవితి రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని ఒకవేళ చూస్తే లేనిపోని అపనిందలు వస్తాయని అవమానాల పాలవుతారని చాలామంది చెబుతూ ఉంటారు.

ఇలా వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం అన్నది అశుభంగా భావించబడుతుంది. మరి నిజంగానే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదా, ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు?అన్న విషయానికి.. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభం. ఇలా చూడడం వలన నీలాపనిందలకు గురి కావాల్సి ఉంటుందని నమ్మకం. చేయని పనికి తప్పుకి మాటలు పడాల్సి ఉంటుంది. కనుక ఈ తప్పుడు ఆరోపణల బారిన పడకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం నిషేధించబడింది. ఇలా చూస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఎవరినా సరే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. అయితే దీని వెనుక ఒక కథ ఉంది.

ఒకసారి గణేశుడు ఎలుకపై స్వారీ చేస్తూ తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. అయితే వినాయకుడు అధిక బరువు కారణంగా అతను తడబడ్డాడు. అలా తబడుతున్న వినాయకుడిని శివుడి శిగలో ఉన్న చంద్రుడు చూసి నవ్వడం మొదలుపెట్టాడు. దీంతో వినాయకుడికి కోపం వచ్చింది. అప్పుడు ఎవరైనా చంద్రుడిని చూస్తే చేయని తప్పుకి కూడా నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించాడు. అయితే దేవతల కోరికతో తాను ఇచ్చిన శాపాన్ని మార్పు చేస్తూ భాద్రపద మాసం శుక్ల చతుర్థిలో ఎవరైనా రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే సమాజంలో అవమానాలు, నిందలను ఎదుర్కోవలసి వస్తుందని గణేశుడు చంద్రుడిని శపించాడు. అంతే కాకుండా అలాంటి వారు చేయని తప్పుకు నిందలు ఎదుర్కోవడమే కాదు తప్పుడు ఆరోపణలు, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించాడు విఘ్నేశ్వరుడు.

అందుకే వినాయక చవితి రోజు చందమామని చూడకూడదని చెబుతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఎవరైనా పొరపాటునైనా వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినట్లయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నీలాప నిందల నుంచి బయటపడవచ్చు. చవితి రోజున ఉపవాసం చేయడం మాత్రమే కాదు వినాయక వ్రత కథను చదివి అప్పుడు ఆ కథ అక్షతలను తీసుకుని తలపై వేసుకోవడం ద్వారా చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చ. అంతేకాదు ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈ దోషం నుండి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే

“సింహః ప్రసేన మవదీత్, సింహో జాంబవంతాహతః, సుకుమారక మారోధి, స్తవహ్యేశ స్యమంతకః “.