Site icon HashtagU Telugu

Vinayaka Chavithi: ఐదవరోజు గణేష్ నిమజ్జనం చేస్తున్నారా.. అయితే శుభ సమయం ఇదే!

Vinayaka Chavithi

Vinayaka Chavithi

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను మూడు రోజుల మొదలుకొని 21 రోజుల వరకు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే వినాయక చవితి వేడుకలు మొదలై మూడు రోజులు పూర్తి అవ్వడంతో కొన్ని కొన్ని ప్రదేశాలలో చిన్న చిన్న మట్టి విగ్రహాలను అలాగే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేసేశారు. నేడు నాలుగవ రోజు. రేపు అనగా బుధవారం రోజు ఐదవ రోజు కావడంతో చాలావరకు విగ్రహాలు రేపు నిమజ్జనం కానున్నాయి. ఐదు రోజులలో చాలా విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

మామూలుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత అనంత చతుర్దశి రోజున గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తుంటారు. ఈసారి సెప్టెంబరు 17న అనంత చతుర్దశి. అయితే కొంతమంది మాత్రం తమ ఇంట్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను కొన్ని రోజుల ముందే నిమజ్జనం చేస్తారు. కొంతమంది బప్పా విగ్రహాన్ని 3 రోజులలోపు,మరికొందరు 5 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ నేపధ్యంలో ఐదవ రోజు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలనుకుంటే శుభ ముహర్తం, విధి విధానాలను గురించి తెలుసుకుందాం.. కాగా గణపతి ఉత్సవం 5 వ రోజు సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం. ఈ నేపధ్యంలో 5 వ రోజున గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకునే వారికి ఉదయం 10.45 నుండి 12.18 వరకు శుభ సమయం అని చెప్పవచ్చు.

ఈ సమయంలో నిమజ్జనం చేయడం మంచిదని చెబుతున్నారు. గణేశుడిని నిమజ్జనం చేయడానికి ముందుగా చెక్క ఆసనాన్ని సిద్ధం చేయాలి. దానిని గంగాజలంతో శుద్ధి చేసి స్వస్తిక్ గుర్తు వేయాలి. అనంతరం పీటంపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచి కొత్త బట్టలు ధరింప జేసి, కుంకుమ తిలకం దిద్దాలి. అనంతరం ఆసనంపై అక్షతను ఉంచి గణేశ విగ్రహానికి పూలు, పండ్లు, మోదకం మొదలైన వాటిని సమర్పించాలట. బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేసే ముందు పూర్తి ఆచారాలతో పూజించాలని చెబుతున్నారు. గణేశుని మళ్ళీ ఇంటికి తిరిగి రావాలని కూడా ప్రార్థించాలట.

ఆ తర్వాత కుటుంబంతో కలిసి హారతి ఇచ్చి ఆ తరువాత గణేశ విగ్రహాన్ని ఆచారబద్ధంగా నిమజ్జనం చేయాలట. ఏమైనా తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించమని అడగండి వచ్చే ఏడాది మళ్లీ రావాలని ప్రార్థించాలట. అదేవిధంగా నిమజ్జనానికి వెళ్లే ముందు పొరపాటున కూడా నలుపు నీలం రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు. నిమజ్జనానికి ముందు గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించవద్దు. గణేశుడి అనుగ్రహం కోసం 21 దర్భ కట్టలు సమర్పించాలని చెబుతున్నారు.

Exit mobile version