Site icon HashtagU Telugu

Rose Plant Vastu: గులాబీ .. వాస్తు “లాబీ”!!

Rose Plant Vastu

Rose Plant Vastu

వాస్తు అనేది ఇంటి నిర్మాణానికి, ఇంట్లో వస్తువుల అమరికకు మాత్రమే పరిమితం కాదు..చివరకు పూల మొక్కల కుండీలను పెట్టే విషయంలోనూ వాస్తును సీరియస్ గా పట్టించుకుంటారు చాలామంది!! ఈనేపథ్యంలో వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రత్యేకించి అందరికీ ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కల కుండీలను ఇళ్లలో ఏ వైపున పెట్టాలనేది చెబుతున్నారు. మన ఇంట్లో నైరుతి దిక్కున గులాబీ కుండీ పెడితే మంచిదని అంటున్నారు. ఒకవేళ నైరుతి దిక్కున పెట్టే అవకాశం లేకుంటే.. దక్షిణ దిక్కున గులాబీ కుండీని పెట్టొచ్చని సూచిస్తున్నారు. దక్షిణము దిక్కులో ఎరుపు రంగు పూల మొక్కలు ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సూత్రాన్ని అమలు చేస్తే ఇంటి యజమాని ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి ఎండాకాలం లో గులాబీ మొక్కల కుండీలను పూర్తి ఎండలో పెట్టరాదు. కాస్త నీడ ఉండే ప్రదేశానికి వాటిని మార్చడం మంచిది.

చిన్న సైజు గులాబీ మొక్కలకు..

అయితే చిన్న సైజు గులాబీ మొక్కల కుండీలను మాత్రం నేరుగా సూర్యకాంతి పడే ప్రదేశంలో ఉంచడం శ్రేయస్కరం. వాటికి రోజూ కనీసం 6 గంటల సూర్యకాంతి అవసరం. చిన్న సైజు గులాబీ మొక్కల కుండీలను ఉంచడానికి.. దక్షిణ, పశ్చిమ దిక్కుల్లోని ఇంటి కిటికీలను మించిన ప్లేస్ ఉండదని అంటారు.

సాలె పురుగులకు చెక్ ఇలా..

ఇళ్ళలో గులాబీ మొక్కలకు ప్రధాన ముప్పు సాలె పురుగుల నుంచి ఉంటుంది. సాలె పురుగులు అవకాశం దొరికితే.. గులాబీ మొక్కలపై గూడు కట్టేసి ఆకుల్లోని సారాన్ని పీల్చేస్తాయి. ప్రధానంగా పొడి వాతావరణంలో ఉండే గులాబీ మొక్కలే సాలె పురుగుల తొలి టార్గెట్ గా ఉంటాయి. ఈ ముప్పు నుంచి బయట పడేందుకు.. గులకరాళ్లు, నీటితో నింపిన పాత్రలో గులాబీ కుండీని ఉంచాలి. ఇలా చేయడం వల్ల మొక్క చుట్టూ తేమతో కూడిన వాతావరణ వలయం ఏర్పడుతుంది. ఫలితంగా సాలె పురుగులు మొక్కపై సాలె గూడ్లు కట్టుకునే వీలు ఉండదు. ఎండిపోయిన పూలను, పచ్చగా మారిన ఆకులను, పొడుగ్గా పెరిగిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి తీసేస్తే గులాబీ మొక్క ఏపుగా పెరుగుతుంది.