ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వసంత పంచమిని జరుపుకోనున్నారు. ఈ ఏడాది అనగా 2025 లో ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి పండుగ వచ్చింది. ఇకపోతే ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థులు అమ్మవారిని పూజించడం వల్ల చదువు బాగా రావడంతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే ఎలాంటి పనులు తలపెట్టిన అందులో ఆటంకాలు ఎదురవుతున్న వారు, వృత్తిలో వచ్చే ఆటంకాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారు ఈ రోజున అమ్మవారిని పూజించడంతోపాటు కొన్ని రకాల నైవేద్యాలు సమర్పించడం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. మరి వసంత పంచమి రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అన్న విషయానికి వస్తే.. ఈరోజు సరస్వతీ దేవితో పాటు శివుడు, విష్ణువుని పూజించడం ప్రత్యేక ఆచారం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ సమయంలో ఐదు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల సరస్వతీ దేవి ఆశీస్సులు లభిస్తాయట. ఈ రోజు పసుపు రంగుకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే పసుపు రంగు స్వీట్లు ఎక్కువగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే సంపద, సంతోషం, శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్మకం.
శనగపిండి లడ్డు… వసంత పంచమి రోజు శనగపిండి లడ్డు ను సమర్పించడం వల్ల సరస్వతీ దేవి అనుగ్రహం లభిస్తుందట. ఈ రోజు దేశీ నెయ్యితో చేసిన శనగపిండి లడ్డు ని అమ్మవారికి సమర్పించడం వల్ల, సరస్వతీ దేవితో పాటు దేవగురువు బృహస్పతి, విష్ణువు అనుగ్రహాలు కూడా లభిస్తాయట.
స్వీట్ బూందీ… అలాగే సరస్వతీ దేవిని ఇష్టమైన మరొక పదార్థం స్వీట్ బూందీ. పూజ సమయంలో అమ్మవారికి స్వీట్ బూందీ సమర్పిస్తే సకల బాధలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. బూందీ లడ్డు సమర్పించి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలట. ఇలా చేయడం వల్ల సరస్వతీ దేవి దయ మీ పైన ఉండడంతో పాటు అదృష్టం తలుపు తడుతుందని చెబుతున్నారు.
మాల్పువా.. పిల్లలకు చదువులో, పెద్దలకు వృత్తిలో ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు సరస్వతీ దేవికి మాల్పువా సమర్పించాలట. దీనిని నైవేద్యంగా సమర్పించడం వల్ల మానసిక వికాసాన్ని పొందవచ్చట. అలాగే తెలివితేటలు కూడా మెరుగవుతాయట. సరస్వతీ దేవి అనుగ్రహం పొందటం కోసం మీ పిల్లలతో తప్పని సరిగా మాల్పువా పూజలో పెట్టించాలని, ఇలా చేస్తే పిల్లలు చదువులో రాణిస్తారని చెబుతున్నారు.
పరమాన్నం.. సరస్వతీ దేవికి పాలు, వెన్న, నెయ్యి అంటే మహా ప్రీతి. అందుకే వసంత పంచమి రోజు బెల్లం వేసి పరమాన్నం చేసి సమర్పించాలట. దేశీ నెయ్యి, చక్కెర లేదా బెల్లం, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసి పరమాన్నం తయారు చేసి భోగంగా సమర్పించాలని చెబుతున్నారు. కుంకుమ పువ్వు వేసి తయారు చేసిన ఖీర్ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చట.
రాజ్ భోగ్… సరస్వతీ దేవికి ఇష్టమైన మరొక ప్రసాదం రాజ్ భోగ్. పాలతో చేసే ఈ పదార్థం అమ్మవారికి ఎంతో ఇష్టమట. రాజ్ భోగ్ సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుందని చెబుతున్నారు.. దీనితో పాటు సరస్వతీ దేవికి పసుపు వస్త్రాలు, పసుపు మిఠాయిలు పెట్టవచ్చట. సరస్వతీ దేవి పూజా సమయంలో రాజ్ భోగ్ సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీనితో పాటు శనగపిండితో చేసే జిలేబి కూడా పెట్టుకోవచ్చట.