ప్రతీ ఏడాది మాఘ మాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటాము. అయితే ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025న వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతి దేవిని ఆ రోజు ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. అయితే వసంత పంచమి రోజు సరస్వతి దేవిని పూజించడం వల్ల సరస్వతి దేవి కటాక్షం కలుగుతుందట. ముఖ్యంగా విద్యార్థులు కచ్చితంగా ఆ రోజు సరస్వతి దేవిని తప్పకుండా పూజించాలని పండితులు చెబుతున్నారు.
అయితే ఫిబ్రవరి 2వ తేదీన సరస్వతి ఏ సమయంలో పూజించాలి? అనుకూలమైన సమయం ఏది అన్న విషయానికి వస్తే.. వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని ఉదయం 7:09 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు పూజించవచ్చట. మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2న ఉదయం 9:14కు మొదలై మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 3న ఉదయం 6:52 వరకు ఉంటుందట. వసంత పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్న విషయానికి వస్తే.. వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించాలని చెబుతున్నారు. వివాహం నుంచి గృహప్రవేశం వరకు ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడానికి చాలా మంచిదట. అలాగే
ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో కచ్చితంగా విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు.
ముఖ్యంగా శుభకార్యాలు జరపాలి అనుకున్న వారు ఈ రోజున ముహూర్తం చూడకుండా శుభకార్యాలని జరపవచ్చట. ఇకపోతే చదువులో వెనుకబడి ఉన్న పిల్లలు, చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలు వసంత పంచమి రోజు ఉదయం పవిత్రమైన సరస్వతి యంత్రాన్ని ఇంటి పూజ గదిలో పెట్టాలట. తెల్ల చందనాన్ని, పసుపు, తెలుపు పువ్వులని సమర్పించి, ధూప, దీపాలను వెలిగించాలట. ఆ తర్వాత “ఓం హ్రీం హ్రీం హ్రీం సరస్వతియే నమః” అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలని, పిల్లలు ఈ మంత్రాన్ని జపిస్తే తప్పకుండా చదువు వస్తుందని చెబుతున్నారు. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించి పిల్లలకి పుస్తకాలు పంచడం మంచిదట. ఈ రోజు అవసరమైన పిల్లలకు పుస్తకాలని పంచడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందట. అలాగే పిల్లల మనసును కూడా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కలిగిన చేయవచ్చని పండితులు చెబుతున్నారు.