Site icon HashtagU Telugu

Varalakshmi Vratam: 2024లో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు.. డబ్బు రావాలంటే ఇలా చేయాల్సిందే!

Varalakshmi Vratam

Varalakshmi Vratam

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి కూడా ఒకరు. ఈ వరలక్ష్మి దేవికి ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం అని శ్రావణమాసంలో పూజలు కూడా చేస్తూ ఉంటారు. శ్రీ మహా విష్ణువుకి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయట. అంతేకాదు వరలక్ష్మి అమ్మవారి పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుస్సుని ఇస్తుందని విశ్వాసం. అయితే ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. ఈ వరలక్ష్మీ వ్రతం జరుపుకొని తప్పకుండా కొన్ని రకాల పూజా విధానాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరే ఆ ఇంటి కాసుల వర్షం కురుస్తుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ముందుగా గృహిణులు ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి ముందు ముగ్గు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టాలి. అలాగే బంతిపూల దండలతో ఇంటి గుమ్మాలను అందంగా అలంకరించుకోవాలి. పూజ సామాగ్రిని చీర జాకెట్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక శ్రావణ శుక్రవారం తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంగ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు మాత్రమే ధరించాలి. తర్వాత వ్రత మండపాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా మండపాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి. తర్వాత వరిపిండితో పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఇప్పుడు మండపం దగ్గర అరటి కొమ్మలు పెట్టుకోవాలి. మండపాన్ని మామిడాకులతో, పువ్వుల దండతో అలంకరించాలి. ఇష్టమైన వారు మండపానికి లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు.

ఇలా అందంగా రెడీ చేసిన మండపాన్ని ఇంట్లో తూర్పు దిక్కుకు అభిముఖంగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వరలక్ష్మి దేవి పూజ కోసం రెడీ చెయ్యాలి. ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందు కోసం వెండి, రాగి, ఇత్తడి ఇలా ఏ లోహంతో చేసిన కలశాన్ని తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి. అందులో బియ్యం పోసి మావి చివుళ్ళు వంటి వాటిని పెట్టి కొబ్బరి కాయను కలశంలోని మావి చివుల్లపై పెట్టాలి. ఇప్పుడు ఎరుపు రంగు జాకెట్ ను తీసుకుని దానిని కొబ్బరి కాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలశాన్ని అలంకరించాలి. తర్వాత పువ్వు పెట్టి ఆ కలశం దగ్గర కుర్చుని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పూజ చేయడానికి ముందు దీపాలను వెలిగించాలి. లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన పాయసం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు ముందుగా విఘ్నలకధిపతి వినాయకుడిని పూజించాలి.

ఆపై సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే.. శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ వరలక్ష్మి వ్రతానికి సంబందించిన పూజను మొదలు పెట్టాలి. వరలక్ష్మి వ్రత కథ చదివిన అనంతరం అమ్మవారికి చీర, జాకెట్, గాజులు, పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూపం వేయాలి. ఇలా లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం హారతి ఇవ్వాలి. తర్వాత ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయినం అందించాలి. కొబ్బరి ముక్కలు కలిపిన నాన బెట్టిన శనగలు, తమలపాకులు, రెండు అరటి పండ్లు, పసుపు , కుంకుమ, జాకెట్ ముక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి అని స్మరించుకోవాలి. ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం అని అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. ఎవరికైనా శ్రావణ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలుకాకపోతే మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తే తప్పకుండా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.