Site icon HashtagU Telugu

Valmidi Temple: వల్మీడి రాములోరి గుడి ప్రారంభానికి సిద్ధం, చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం!

Valmidi

Valmidi

ఆది కావ్యం రామాయణాన్ని రాసిన వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వ‌ల్మీడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, ఆల‌య పునః ప్రారంభ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగబోతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, పాలకుర్తి అత్యంత చారిత్రాత్మక ప్రాంతం. చరిత్రలో నిలిచిపోయే విధంగా వల్మీడి రామాలయ నిర్మాణం ఉందని ఆయన అన్నారు. ఘనమైన చరిత్రకు సాక్షిగా, దేవాలయం విరాజిల్లుతుంది అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇందుకు భారీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉత్స‌వాల‌కు త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల కోసం అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నం అని చెప్పారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌పై గత నెల 22న, 30న స‌మీక్ష చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌రోసారి సెప్టెంబర్ 2వ తేదీన వ‌ల్మీడి గుట్ట మీద సమీక్ష చేశారు. ఈ సమీక్షకు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా క‌లెక్ట‌ర్‌, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారులు హాజరయ్యారు. స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, దేవాలయంలో పూజలు చేసి, వేదాశీర్వచనం తీసుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అధికారులతో అంశాల వారీగా సమీక్షించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇంకా జ‌ర‌గాల్సిన ఏర్పాట్ల‌పై అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. నిర్ణీత స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుజ‌ర‌గాల‌ని ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ.. ఆది కావ్యంగా కీర్తినందుకున్న రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి వ‌ల్మీడికి చెందిన వాడుగా చ‌రిత్ర బెబుతున్న‌ది. రాములోరి గుడి మీద రాముడు, సీత ఉండేవార‌ట‌. ఈ పక్కనే మ‌హాక‌వి పాల్కురికి సోమ‌నాథుడు, స‌హ‌జ‌క‌వి బ‌మ్మెర పోత‌న‌ల జ‌న్మ‌స్థానాలున్నాయి. ఇంత పురాత‌న సాహిత్య చ‌రిత్ర ఉన్న ప్రాంతం ఈ భూమి మీద మ‌రోటి లేదు. ఇంత గొప్ప చారిత్రాత్మ‌క ప్రాంతానికి మనమంతా వారసులం. ఈ వ‌ల్మీడి రాములోరి గుట్ట మీద స్వ‌యంభుగా వెల‌సిన శ్రీ సీతారామ‌చంద్ర స్వామిదేవాల‌యాన్ని పునః ప్రారంభిస్తున్నాం. ఆల‌యంలోని విగ్ర‌హాల పునఃప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభం అయ్యాయి. 4వ తేదీన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన జరగనుండగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు రానున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మ‌రోసారి పిలుపునిచ్చారు.

Also Read: Kushi Box Office: ఖుషికి భారీ ఓపెన్సింగ్స్, మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే!