హిందువులు జరుపుకునే పండుగలు ముక్కోటి ఏకాదశి కూడా ఒకటి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున మామూలు ద్వారం నుంచి కాకుండా వైకుంఠ ద్వారం నుంచి భక్తులు లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. అయితే వేద పంచాంగం ప్రకారం ఈ పండుగ సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయంలో వస్తుంది. పుష్య మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని పుష్య పుత్రాద ఏకాదశి రోజుగా లేదా వైకుంఠ ఎకాదశిగా జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి తిథి రోజున శ్రీ హరిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
అయితే పుష్య మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి జనవరి 9 మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తిథి జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈ రోజున ఆచారాల ప్రకారం విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించాలి. సాయంత్రం సమయంలో హారతి ఇచ్చి అనంతరం పండ్లు తీసుకోవాలి. రాత్రి జాగరణ చేస్తూ శ్రీ మహా విష్ణువుని పూజించాలి. మర్నాడు ద్వాదశి రోజున యధావిధిగా పూజ చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం విరమించిన తర్వాత బ్రాహ్మణులకు దానం చేయాలి.
వైకుంఠ ఏకాదశి ఉపవాసాన్ని జనవరి 11న ఉదయం 07:21 నుంచి 8:21 వరకు విరమించవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తర్వాత విష్ణుమూర్తిని ధ్యానిస్తూ రోజును ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. తర్వాత సాధారణ నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి. తరువాత ఒక రాగి పాత్ర తీసుకుని నీటిలో పసుపు కుంకుమ అక్షతలు వేసి సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. పంచోపచారాలు చేసిన తర్వాత విష్ణువును పూజించాలి. పూజ సమయంలో విష్ణువుకు పండ్లు, పువ్వులు మొదలైనవి సమర్పించాలి. పూజ ముగింపులో హారతి ఇచ్చి ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి.