ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ముక్కోటి ఏకాదశి రాబోతోంది.. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి పుష్య మాసంలోనే శుక్లపక్ష ఏకాదశి తిధి 2025 జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12:22 నిమిషాలకు ప్రారంభమయ్యే మరుసటి రోజు అనగా జనవరి 10వ తేదీ ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. విశేషించి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
వైకుంఠం తలుపులు తెరచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఇకపోతే ఈ రోజు ఏం చేయాలి అన్న విషయానికి.. ఉదయాన్నే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాలు చేసుకోవాలి. తర్వాత ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యితో దీపాన్ని వెలిగించి ధ్యానం చేయాలి. ఆ తర్వాత వైష్ణవ ఆలయాలను సందర్శించాలి. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు ఆలయాలను సందర్శించి ఉత్తర ద్వారం ద్వారా ఆయనను దర్శించుకుంటే అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయని నమ్మకం.
ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలిగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. ఈ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహా విష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుందట. అయితే ఏకాదశి అంతరార్థం ఏమిటంటే.. ఏకాదశి అనగా 11. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఈరోజున ఉపవాసం ఉండే వాళ్ళు ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండటమే అసలైన ఉపవాసం అని చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది.