Uttarayanam 2023 : కాలాల్లో ఉత్తరాయణమే పుణ్యకాలం ఎందుకంటే..!

సంక్రాంతి (Sankranti) సందడి మొదలైనప్పటి నుంచీ ఉత్తరాయణం పుణ్యకాలం అనే మాట వింటుంటాం.

సంక్రాంతి సందడి మొదలైనప్పటి నుంచీ ఉత్తరాయణం (Uttarayanam) పుణ్యకాలం అనే మాట వింటుంటాం. ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది..పుణ్యకాలం అని ఎందుకు అంటారు..

‘సరతి చరతీతి సూర్యః’

‘సరతి చరతీతి సూర్యః’ అంటే సంచరించేవాడని అర్థం. సూర్యుడి సంచారం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఏడాది కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం.

‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’

‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. ఆరుమాసాల కాలమైన దక్షిణాయణం రాత్రి.

“సంక్రాంతి” – “సంక్రమణం” అంటే “చేరడం” లేదా “మారడం”అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.  సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే స్నానమాచరిస్తారో వారికున్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయని.. ఎవరైతే భక్తిశ్రద్ధలతో స్నానమాచరించరో అలాంటి వారు ఏడు జన్మలు రోగిగా, దరిద్రుడిగా పుడతారని పండితులు చెబుతారు.

ఉత్తరాయణం (Uttarayanam) పుణ్యకాలం అంటే దక్షిణాయనం కాదా మరి!

ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు కాబట్టి  దక్షిణాయణం పాపకాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. ఉత్తరాయణంలో దేవతలకు పగలు కాబట్టి ఈ ఆరునెలల మేల్కొని ఉంటారు. ఈ కాలంలో కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా ఉంటుంది. సాధారణంగా దక్షిణ దిక్కు కన్నా ఉత్తర దిక్కుని పవిత్రంగా భావిస్తారు. ఉత్తర దిక్కును , ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు రావడం,  సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే నివాస స్థానాలు కావటం వీటితో పాటూ  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్ల ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తారు.

సూర్య గమన్నాని బట్టి వాతావరణంలో మార్పులు:

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగానూ , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగా చెబుతారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని ఈ సమయంలో భక్తితో ఏం కోరుకున్నా దేవతలు తీరుస్తారని పండితులు చెబుతారు. ఈ  విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగను పెద్ద పండుగగా జరపడం మొదలెట్టారట.

మనం నిద్రలేవగానే ఇంటి తలుపులు తీసినట్టే ఉత్తరాయణం ప్రారంభమైన ఈ రోజున దేవతలు నిద్రలేవడంతో ఈ ఆరు నెలలు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. వాస్తవానికి ప్రతి సంక్రాంతికి పితృతర్పణాలు ఇవ్వాలి…ముఖ్యంగా మకర సంక్రాంతికి తప్పకుండా ఇవ్వాలని చెప్పడం వెనుకున్న కారణం కూడా ఇదే. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని అందుకే చెబుతారు.

Also Read:  Sakat Chauth : ఈ నెలలోనే “సకత్ చౌత్”.. శుభ ముహూర్తం.. పూజా విధి ఇదీ