Site icon HashtagU Telugu

Ugadi 2025: ఉగాది పండుగ రోజు ఏ దేవుడిని పూజించాలి.. వేటిని దానం చేస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?

Ugadi 2025

Ugadi 2025

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. అంతేకాకుండా హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ కూడా ఇదే అని చెప్పాలి. కొత్త సంవత్సరం ఈ పండుగతోనే మొదలవుతుందని అంటూ ఉంటారు. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది. అయితే ఉగాది పండగ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇక ఈ ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు.

ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం. అందుకనే ఉగాది రోజున తెల్లవారు జామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలను కటాడతారు. అయితే ఈ ఉగాది పండుగ రోజు ఏ దైవాన్ని పూజించాలి అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి అన్న విషయానికి వస్తే.. ఈరోజున శ్రీమహా విష్ణువు లేదంటే శివుడు లేదంటే జగన్నాథను ధ్యానించినా పూజించినా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

ఇలా ఈ దేవుళ్లకు పూజ చేసిన తర్వాత ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించాలట. పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంటిలో కుటుంబ సభ్యులందరికే అందించాలని,ఈ ఉగాది పచ్చడికి వైద్య పరంగా విశిష్టమైన గుణం ఉందని చెబుతున్నారు. ఉగాది నుంచి వేసవికాలం మొదలవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా ఈ ఉగాది పండుగ రోజున గొడుగులు చెప్పులు వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట.