Ayyappa Devotees : ఈసారి కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు జరగనున్నాయి. ఈతరుణంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) భక్తుల దర్శనానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్స్(Ayyappa Devotees) ఉండవని వెల్లడించింది. గతేడాది స్పాట్ బుకింగ్స్, ఆన్ లైన్ బుకింగ్స్ రెండింటినీ అనుమతించారు. దీంతో ప్రతిరోజూ సగటున లక్షన్నర మందికిపైగా భక్తులు శబరిమలకు వచ్చారు. అయితే వారందరికీ సరిపోయే రీతిలో క్యూ లైన్లను కానీ, దర్శనం కౌంటర్లను కానీ, రవాణా ఏర్పాట్లను కానీ చేయలేదు. ఫలితంగా వారిలో దాదాపు 80వేల నుంచి 90 వేలమందికి దర్శన అవకాశం దొరికే సరికే దాదాపు 20 గంటల టైం పట్టింది. దీంతో ఎంతోమంది భక్తులు అప్పట్లో శబరిమలకు వచ్చినా.. అయ్యప్ప స్వామివారి దర్శనాన్ని చేసుకోలేకపోయారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు స్పాట్ బుకింగ్స్‌ను ఆపేశామని శబరిమల ఆలయ బోర్డు వర్గాలు తెలిపాయి.
Also Read :China Vs Taiwan : తైవాన్ చుట్టూ చైనా ఆర్మీ.. భారీ సైనిక డ్రిల్స్
- ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకునే వారికి దాదాపు 48 గంటల గ్రేస్ టైంను కేటాయిస్తారని సమాచారం. అంటే శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకున్న సమయంపై అదనంగా 48 గంటల టైం కూడా భక్తులకు కేటాయిస్తారన్న మాట. ఒకవేళ ఆలస్యంగా శబరిమలకు చేరుకున్నా.. గ్రేస్ టైంను వాడుకొని దర్శనం చేసుకొని వెళ్లొచ్చు.
- అయ్యప్ప భక్తులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. శబరిమల ఆలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్లు, ప్రసాదాలను ఆన్‌లైన్లో బుక్ చేసుకోవాలి. రోజుకు 80 వేల మంది భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నారు.
- అయ్యప్ప భక్తులకు దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి.ఈ మార్పు వల్ల అయ్యప్ప దర్శనాలకు రోజూ 17 గంటల పాటు సమయం లభిస్తుంది.
- డిసెంబరు 26న అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. మళ్లీ డిసెంబరు 30 నుంచి మకరు విళక్కు పూజల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి (మకర విళక్కు) దర్శనం ఉంటుంది. జనవరి 20న అయ్యప్ప పడిపూజతో మకరు విళక్కు సీజన్ ముగుస్తుంది.