Site icon HashtagU Telugu

Tulasi Vivaham: తులసి వివాహం ఎప్పుడు జరుపుకోవాలి.. పూజా విధి విధానాలు ఇవే!

Tulasi Vivaham

Tulasi Vivaham

పంచాంగం ప్రకారం నవంబర్ 12 మధ్యాహ్నం వరకు ఏకాదశి ఘడియలు ఉండి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభవుతుంది. అలాగే కార్తీక మాసంలో 12వ రోజున తులసి వివాహాన్ని జరిపిస్తారు అన్న విషయం తెలిసిందే. నవంబర్ 13 బుధవారం ఉదయం పదిన్నరకు ద్వాదశి ఘడియలు పూర్తవుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి పూజ సాయంత్రం జరుపుకుంటారు. అందుకే క్షీరాబ్ది ద్వాదశిని నవంబర్ 12నే జరుపుకోవాలని చెబుతున్నారు. ఇకపోతే ఈ తులసి వివాహం రోజున ఏం చేయాలి. అమ్మవారిని ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి.

తులసికోట దగ్గర వీలైతే ఆవు పేడతో అలక వచ్చు. లేకపోతే నీటితో శుద్ధి చేయాలి. తులసి కోట దగ్గర బియ్యం పిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్​ గుర్తులు ఉన్నటువంటి ముగ్గు వేయాలి. ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది. తర్వాత తులసికోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవునెయ్యి పోయాలి. 9 వత్తులు వేసి దీపం పెట్టాలి. గులాబీ పూలు, తెల్లటి పూలు తులసికోట దగ్గర ఉంచాలి. అలాగే ద్రాక్ష పండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. “ఓం బృందావనీయాయ నమః”అనే మంత్రం చదువుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.

ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. అలాగే ఈ రోజు తులసికోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలట. తులసికోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలట.