Shani Sade Sati: జీవితంలో ఎవరైనా ఏలి నాటి శని బారిన పడినప్పుడు వారు ఇబ్బందులు అలాగే అనేక ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో సరైన నివారణలు, సకాలంలో పూజలను చేయడం వలన శనీశ్వరుడి వల్ల కలిగే ఇబ్బందికరమైన ప్రభావాలను తగ్గించవచ్చట. అసలు ఇంతకీ ఏలినాటి శని అంటే ఏమిటి అన్న విషయాన్ని వస్తే.. ఒక రాశి మొదటి, రెండవ, పన్నెండవ ఇళ్లలో శని సంచరిస్తే ఆ కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఇది మూడు రాశులను ఒకేసారి ప్రభావితం చేస్తుంది.
దీని ప్రభావం దాదాపుగా ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి కెరీర్ లో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి ఎన్నో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందట. కాగా ఏలినాటి శని ప్రభావం తగ్గడం కోసం మంగళ, శనివారాల్లో కొన్ని పరిహారాలు చేయాలి. అవేమిటంటే.. శని దేవుడికి స్నేహితుడిగా పరిగణించబడే హనుమంతుడికి మంగళవారం అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడట. అటువంటి వ్యక్తులపై శని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలట.
వీలైతే మంగళవారం రోజు సుందరకాండ పారాయణం చేయడం మంచిదని, ఈ పరిహారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి శనగలు, సింధూరం, మల్లె నూనెను సమర్పించాలట. హనుమంతుడికి ప్రసాదంగా బూందీ ప్రసాదాన్ని సమర్పించి తర్వాత ఈ ప్రసాదాన్ని పేదలకు పంచాలట. అదేవిధంగా శనివారం శనిదేవుడికి అంకితం చేయబడింది. కాబట్టి శనివారం శనీశ్వర ఆలయాన్ని సందర్శించి శనిదేవుడికి ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించాలట.
శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలని చెబుతున్నారు.
అలాగే శనివారం రోజు పేదలకు, అవసరం ఉన్నవారికి మినప పప్పు, నల్ల నువ్వులు, ఆవాల నూనె, దుప్పట్లు లేదా బూట్లు దానం చేయాలట. శని స్తోత్రం, దశరధుని శని స్తోత్రాన్ని శనివారం పఠించడం కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. శనివారం రోజు పేదవాడికి లేదా బిచ్చగాళ్ళకు అన్నదానం చేయాలట. ఈ పరిహారం శనిదేవుడికి చాలా ఇష్టమైనది అని చెబుతున్నారు పండితులు.
Shani Sade Sati: మీరు కూడా ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. అయితే మంగళ, శనివారాల్లో ఈ పని చేయాల్సిందే!

Lord Shani