Site icon HashtagU Telugu

Karthika Maha Deepotsavam: విశాఖలో ఈనెల 14న కార్తీక మహాదీపోత్సవం..!

విశాఖపట్నం ఆర్. కె బీచ్ లో నవంబర్ 14వ తేదీన టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు, దాతలు, శ్రీవారి సేవకులు సమష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని టీటీడీ జెఈవో సదా భార్గవి పిలుపు నిచ్చారు.ఆర్. కె బీచ్ లోని కాళిక అమ్మవారి ఆలయం ఎదురుగా బీచ్ లో కార్తీక మహాదీపోత్సవం నిర్వహించే స్థలాన్ని ఆమె అధికారులతో కలసి పరిశీలించారు. వేదిక నిర్మాణం, బారికేడ్లు, భక్తులు వచ్చీ పోయేందుకు ఏర్పాటు చేయాల్సిన మార్గాల గురించి అధికారులతో చర్చించారు. భక్తుల భద్రత, దీపాల ఏర్పాటు,పాసుల జారీ, ప్రసాద వితరణ అంశాలపై సదా భార్గవి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో దాతలు, నిర్వాహకులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ.. 2020లో లోకక్షేమం, హిందూ ధార్మిక ప్రచారం కోసం టీటీడీ కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే 14వ తేదీ విశాఖలో మూడోసారి ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిందన్నారు. గత ఏడాదికంటే మరింత ఘనంగా దీపోత్సవం నిర్వహణకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 2500 పాసులు జారీ చేస్తున్నామని ఒక పాసుమీద నలుగురిని అనుమతిస్తామన్నారు.14వ తేదీ ఉదయం కళ్యాణ మండపం నుంచి వేదిక వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వెళతామని చెప్పారు. సాయంత్రం 5. 30 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమం అయ్యాక కూడా విశాఖలో భక్తులు మరచిపోలేనంత ఘనంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు.