తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు మహారాష్ట్రలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ (Padmavati Ammavari Temple) నిర్మాణం కోసం భూమి కేటాయించాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్(Maharashtra Chief Minister Shri Devendra Fadnavis)ను అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) చేతుల మీదుగా అభ్యర్థన పత్రాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశారు.
నవి ముంబైలో అమ్మవారి ఆలయ నిర్మాణంతో పాటు బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ అభ్యర్థన సమర్పించారు. ఈ అభ్యర్థన పత్రం అందజేయడం తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయ సదస్సులో సోమవారం సాయంత్రం జరిగింది. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు హాజరై ప్రాంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆలయాల పరిపాలన, అభివృద్ధిపై చర్చించేందుకు ఈ సదస్సు నిర్వహించారు.
గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం నవి ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం 3.61 ఎకరాల భూమిని 60 సంవత్సరాల లీజు ప్రాతిపదికన టీటీడీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భూమిపై ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు టీటీడీ అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం మరో 1.5 ఎకరాల భూమిని కోరుతోంది. అంతేకాకుండా, మహారాష్ట్రలో భక్తులకు సేవలు అందించేందుకు టీటీడీ బాంద్రాలో ఒక సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం కూడా ప్రభుత్వం భూమిని కేటాయించాలని అభ్యర్థించింది. ఈ సమాచార కేంద్రం ద్వారా భక్తులకు దర్శన టిక్కెట్ల రిజర్వేషన్, అన్నప్రసాదం వివరాలు, ఇతర సేవల గురించి సమాచారం అందించనున్నారు.
మహారాష్ట్రలో భక్తులకు సేవలు అందించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే, ఆలయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు టీటీడీ సిద్ధంగా ఉంది.