తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో వెలుగుచూసిన కల్తీ కేసు మరోసారి రాజకీయ రంగు ఎక్కుతోంది. వైసీపీ పాలనలో దేవస్థానానికి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉందనే ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమై నెలల తరబడి కొనసాగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులను విచారించింది. అయితే ఇప్పటివరకు ఈ కేసు పూర్తిగా వ్యాపారదారులకే పరిమితమై ఉండగా, ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అనుబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో కేసు మలుపు తిరిగింది.
Montha Cyclone : అల్పపీడనంగా బలహీనపడిన ‘మొంథా’
బుధవారం రాత్రి సిట్ అధికారులు టీటీడీ మాజీ ఛైర్మన్, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా పని చేసిన అప్పన్నను అరెస్టు చేశారు. అప్పన్న గతంలో 2014 నుంచి 2024 వరకు వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా, తరువాత ఢిల్లీలో ఏపీ భవన్‌లో ప్రోటోకాల్ ఓఎస్‌డీగా కూడా పనిచేశారు. సిట్ విచారణలో అప్పన్నను ఇంతకు ముందు రెండుసార్లు ప్రశ్నించినప్పటికీ ఆయన సమాధానాలు తృప్తికరంగా లేవని అధికారులు తెలిపారు. విచారణపై ఆయన హైకోర్టులో స్టే తెచ్చుకున్నప్పటికీ, సిట్ సుప్రీంకోర్టుకు వెళ్లి దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతి పొందింది. దీంతో మరోసారి విచారణ మొదలుపెట్టిన అధికారులు చివరికి అప్పన్నను అదుపులోకి తీసుకొని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
ఇప్పుడున్న పరిణామాలు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కూడా దర్యాప్తు పరిధిలోకి తీసుకురానున్నాయా? అన్న ప్రశ్నపై చర్చ మొదలైంది. సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న కాలంలోనే మూడు కంపెనీలు కల్తీ నెయ్యి సరఫరా చేశాయని సిట్ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే విచారించగా, ఇప్పుడు అప్పన్న కస్టడీ విచారణలో లభించే వివరాల ఆధారంగా సుబ్బారెడ్డి పాత్రను కూడా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అప్పన్న చెబే వివరాలు కేసు దిశను పూర్తిగా మార్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి, తిరుమల లడ్డూ నెయ్యి కేసు ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తూ రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.
