Site icon HashtagU Telugu

Gopadma Vrata : ఇవాళ వాసుదేవ ద్వాదశి.. గోపద్మ వ్రతం గురించి తెలుసా ?

Vasudeva Dwadashi Gopadma Vrata

Gopadma Vrata : ఇవాళ వాసుదేవ ద్వాదశి. దీన్నే ఆషాడ శుద్ధ ద్వాదశి (Vasudeva Dwadashi) అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి మరుసటి రోజు జరుపుకొనే పండుగ ఇది. ఈరోజు శ్రీమన్నారాయణుడిని పూజిస్తారు. వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే. వసుదేవుని కుమారుడైనందున కృష్ణుడికి వాసుదేవుడు అనే పేరు వచ్చింది. వాసుదేవుడు అంటే.. అన్నింటిలో వసించు వాడు అని అర్థం., విష్ణు సహస్రనామంలో ‘సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’ అనే వాక్యానికి ఇదే అర్ధం ఉంది. అర్జునుడు శ్రీకృష్ణుణ్ని వాసుదేవా అనే పిలిచేవారు. చాతుర్మాస దీక్ష తొలి ఏకాదశి నుంచి ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని స్మృతి కౌస్తుభం  చెబుతోంది.

We’re now on WhatsApp. Click to Join

తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఇవాళ (వాసుదేవ ద్వాదశి) విష్ణుమూర్తి పూజ చేసి భోజనం చేయొచ్చు. శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో అర్చించాలి. చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం భోజనాలు చేస్తే సరిపోతుంది. ఇవాళ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుందని అంటారు. గోపద్మ వ్రత కథను కూడా చదవాలి.

Also Read :Threats To Biden : చంపేస్తానంటూ బైడెన్‌కు ఓ వ్యక్తి వార్నింగ్స్.. ఏమైందంటే..

గోపద్మ వ్రత విధానం

గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించే ప్రత్యేక వ్రతం(Gopadma Vrata). దీన్ని ఆషాడ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోశాలలో ముగ్గులు వేయాలి. గోశాల అందుబాటులో లేనివారు ఇంట్లో గోవు, దూడ బొమ్మను పెట్టుకొని ముగ్గులు వేసి పూజలు చేయొచ్చు. ఈ ముగ్గుల్లో ఆవు దూడలను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. ఆవు శరీరంపై ఆరు మోహినీ దేవతలకు ప్రతీకగా వేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించాలి. ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి, 33 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి.  మళ్లీ ఆరుగురు మోహినీ దేవతలకు ఆరు సార్లు వేరుగా అర్ఘ్యం సమర్పించాలి. 33 తీపి పదార్థాలను దానం చేయాలి. చివరగా గోపద్మ వ్రత కథను చదివి, అక్షతలు వేయాలి. పూజలో ఉపయోగించిన తీపి పదార్థాలు ముందుగా సోదరులకు పెట్టి, తర్వాత ఇతరులకు దానమివ్వాలి. ఈ గోపద్మ వ్రతాన్ని అయిదు సంవత్సరాలే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు. ఈ వ్రతాన్ని నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రత భగ్నం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగించకూడదు.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.