Site icon HashtagU Telugu

Parshuram Jayanti : గురువు శివుడు.. శిష్యుడు ద్రోణాచార్యుడు.. పరశురామ ది గ్రేట్

Lord Parshuram Jayanti Lord Vishnu

Parshuram Jayanti : ఇవాళ (మంగళవారం)  పరశురామ జయంతి. పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరో అవతారం అని అంటారు.  వైశాఖ శుద్ధ తదియ రోజున పరశురాముడు జన్మించాడని పురాణాల్లో ఉంది. జమదగ్ని మహర్షి, రేణుక దంపతులకు నాలుగో కుమారుడిగా పరశురాముడు జన్మించాడు. నిరంకుశ రాజుల నుంచి ప్రజలను, భూమిని కాపాడేందుకు పరశురాముడు అవతరించాడని అంటారు. సప్త చిరంజీవి దేవుళ్లలో పరశురాముడు ఒకరు. ఆయన ఇప్పటికీ భూమ్మీద బతికే ఉన్నారని భక్తజనం నమ్ముతారు.

పరశురాముడి గురించి.. 

  • పరశురాముడు శివుడి పరమ భక్తుడు. ఈయన శివుడి(Parshuram Jayanti) అనుగ్రహం కోసం కఠినమైన తపస్సు చేయగా అనేక రకాల ఆయుధాలు లభించాయి.
  • పరశురాముడు శివుడి నుంచి అమరుడిగా వరం పొందారు. కలియుగంలోనూ పరశురాముడు సజీవంగానే ఉన్నారు.
  • పరశురాముడు తన గురువైన శివుడి నుంచి సకల విద్యలు నేర్చుకున్నారు.
  • శివుడు తనకెంతో ఇష్టమైన పరశువుని(గొడ్డలి) కూడా పరశురాముడికి ఇచ్చారు. అందుకే ఆయనకు పరశురాముడు అనే పేరొచ్చింది.
  • ఒకసారి శివుడిని కలిసేందుకు కైలాసానికి పరశురాముడు వెళ్లారు.  అప్పుడు వినాయకుడు ఆయనను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన పరశురాముడు తన ఆయుధాన్ని వినాయకుడిపైకి విసురుతారు. విషయం గ్రహించిన వినాయకుడు తండ్రిపై గౌరవంతో పరశురాముడి ఆయుధం తగిలేలా చేసుకుంటారు. అలా వినాయకుడి దంతం ఒకటి విరిగిపోతుంది. దీంతో వినాయకుడు ఏకదంతుడిగా మారుతాడు.
  • పరశురాముడు మహా ముక్కోపి. ఈయన శివుడి నుంచి వినాశక గుణాన్ని, విష్ణువు నుంచి కాపాడే గుణాన్ని పొందారు.
  • జమదగ్ని మహర్షి.. పరశురాముడి తండ్రి. జమదగ్ని మహర్షి వద్ద ఒక మహిమాన్విత గోవు ఉంటుంది.  ఎంత మంది అతిథులు వచ్చినా, అది  ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది. ఈవిషయం మహిష్మతి రాజు కార్తీవీర్యార్జునుడికి తెలుస్తుంది. అతడు జమదగ్ని వద్దకు వచ్చి..  ఆ గోమాతను ఇవ్వమని కోరుతాడు. కానీ అందుకు మహర్షి అంగీకరించరు. దీంతో కార్తీవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోమాతను తీసుకెళ్తాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు ఆగ్రహంతో వెళ్లి ఆ రాజును సంహరించి గోమాతను వెనక్కి తీసుకొస్తాడు.
  • తండ్రి జమదగ్ని మాటను జవదాటని వ్యక్తి పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక ఒకరోజు సరస్సు వద్దకు వెళ్లి తిరిగి రావడం ఆలస్యమవుతుంది.  దీంతో ఆగ్రహించిన జమదగ్ని ఆమెను సంహరించమని కొడుకులను ఆదేశిస్తాడు. కొడుకులంతా అందుకు నిరాకరిస్తారు. అయితే పరశురాముడు తల్లి తలను తెగ నరికి తీసుకొస్తాడు. పితృభక్తికి మెచ్చిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమని అడిగితే తన తల్లి ప్రాణాలను తిరిగి ప్రసాదించమని అడుగుతాడు. అలా తండ్రి మాటను జవదాటకుండానే తల్లి ప్రాణాలను నిలబెట్టుకున్న గొప్పవాడు పరశురాముడు.
  • సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సు విరుస్తాడు.  ఈ విషయం తెలిసిన పరశురాముడు తన గురువైన శివుడి విల్లు విరిచినందుకు కోపంతో రాముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికి ఇస్తాడు. రాముడు దాన్ని కూడా అవలీలగా ఎక్కుపెడతాడు.  శ్రీరాముడు తాను ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు వదలాలి అని పరశురాముడిని అడగగా.. తన తపోశక్తిని కొట్టేయమని చెప్పి తిరిగి మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు.
  • పరశురాముడు మహాభారతంలో ముగ్గురు వీరులకు గురువయ్యాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్ముడికి అస్త్రశస్త్ర విద్యలు నేర్పించాడు.
  • అంబికను పెళ్లి చేసుకోమని భీష్ముడిని పరశురాముడు కోరుతాడు.  అయితే అయినందుకు భీష్ముడు  నిరాకరించాడు.దీంతో కోపగించిన పరశురాముడు భీష్ముడితో తలపడ్డాడు. చివరకు దేవతలు చెప్పడంతో యుద్ధం ఆపారు.
  • కర్ణుడు తాను బ్రాహ్మణుడిని అసత్యం పలికి పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరి అస్త్ర విద్యలు నేర్చుకుంటారు. ఆ తర్వాతి నిజం తెలియడంతో కర్ణుడిని పరశురాముడు శపిస్తాడు. యుద్ధకాలంలో తెలిసిన విద్యలు గుర్తుకు రావు అని కర్ణుడిని ఆయన శపించాడు.
  • ద్రోణాచార్యుడు.. పరశురాముడి దగ్గర దివ్యాస్త్రాలను గ్రహించాడు.