భీష్ముని మహిమ..సంతానయోగానికి మార్గం
‘వైయాఘ్య్రపద గోత్రాయ’ శ్లోకం ప్రాముఖ్యత
భీష్మ తర్పణ విధానం..ఎవరు, ఎలా చేయాలి?
Bhishma Ashtami 2026 : భీష్మాష్టమి హిందూ ధర్మంలో విశేష ప్రాధాన్యం కలిగిన రోజు. మహాభారతంలోని మహావీరుడు, ధర్మప్రతీక అయిన భీష్ముడిని స్మరించుకుంటూ ఈ రోజున చేసే తర్పణం వల్ల అనేక శుభఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోరుకునే వారు భీష్మునికి తిలాంజలి లేదా తర్పణం సమర్పిస్తే కోరుకున్న ఫలితం దక్కుతుందని స్మృతి కౌస్తుభం గ్రంథం స్పష్టం చేస్తోంది. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా జీవించినప్పటికీ సమస్త లోకానికి ఆయనే సంతానమని శాస్త్రవాక్యం చెబుతోంది.
భీష్ముడు తన జీవితాన్ని ధర్మం, త్యాగం కోసం అంకితం చేసిన మహానుభావుడు. ఆయనకు స్వంతంగా సంతానం లేకపోయినా ఆయనను లోకమంతా తండ్రిగా భావిస్తుందని పురాణాల భావన. అందుకే భీష్మాష్టమి రోజున ఆయనకు తర్పణం సమర్పిస్తే సంతాన లోపం తొలగిపోతుందని కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని నమ్మకం ఉంది. విశేషంగా తండ్రి జీవించి ఉన్నవారు కూడా ఈ రోజున భీష్మునికి తర్పణం ఇవ్వవచ్చని ధర్మశాస్త్రాలు అనుమతిస్తున్నాయి. ఇది భీష్మునికే ప్రత్యేకమైన విశిష్టతగా భావిస్తారు.
భీష్మ తర్పణ సమయంలో ‘వైయాఘ్య్రపద గోత్రాయ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ నీటిని వదలడం అత్యంత ఫలప్రదమని విశ్వాసం. ఈ విధంగా తర్పణం చేయడం వల్ల సంవత్సరకాలం పాటు చేసిన పాపాలు నశిస్తాయని పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతారు. పితృదోషాలు తొలగి కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయని భక్తుల విశ్వాసం. అందుకే భీష్మాష్టమి రోజున ఈ శ్లోకంతో తర్పణం చేయడాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తారు.
భీష్మ తర్పణం పురుషులు మాత్రమే చేయాలనే నియమం ఉంది. ఈ రోజున ఉదయం తలస్నానం చేసి నిత్యకర్మలు, పూజలు పూర్తి చేయాలి. మధ్యాహ్నం సమయంలో పూజామందిరంలో లేదా ఇంటి ఆవరణలో దక్షిణ ముఖంగా కూర్చోవాలి. ఆచమనంతో పాటు ప్రాణాయామం చేసి మనసును శుద్ధి చేసుకోవాలి. అనంతరం ‘పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్యం కరిష్యే’ అని సంకల్పం చెప్పుకుని భీష్మునికి జలాన్ని సమర్పించాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా తర్పణం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయని విశ్వాసం. భీష్మాష్టమి రోజున భీష్ముని స్మరించి తర్పణం చేయడం ద్వారా ధర్మం, త్యాగం విలువలను గుర్తుచేసుకుంటూ ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.
