Bhanu Saptami : ఇవాళ భానుసప్తమి. ఆదివారం రోజు సప్తమి తిథి కలిసి వస్తే దాన్నే భానుసప్తమి లేదా విజయ సప్తమి లేదా కల్యాణ సప్తమి అని పిలుస్తుంటారు. భానుసప్తమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీనివల్ల విశేష ఫలితాలు వస్తాయి. ఇవాళ పూజ, దానం, జపం, హోమం చేయడం మంచిది. భానుసప్తమి(Bhanu Saptami) రోజు సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల వరకు పూజలు చేయడం మంచిది.
We’re now on WhatsApp. Click to Join
భాను సప్తమి రోజున సూర్య భగవానుడికి సమర్పించేందుకు పరమాన్నం తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఆవు పాలను పొంగించి దానిలో పిడికెడు బియ్యం, బెల్లం, నెయ్యి వేయాలి. దీంతో పరమాన్నం రెడీ అవుతుంది. ఇంట్లో సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో రథం ముగ్గు వేసుకోవాలి. దాని మధ్యభాగంలో పద్మాన్ని గీయాలి. ముగ్గు చుట్టూ పూలు, పసుపుకుంకుమలు వేసి అలంకరించాలి. సూర్యుడికి 12సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేయాలి. రాగిపాత్రలో నీటిని తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. చివరగా పరమాన్నాన్ని సూర్యుడికి అందించాలి. అనంతరం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇవాళ ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. సూర్యభగవానుడు యావత్ లోకానికి అన్నదాత. ఆయన కాంతి ప్రసరించనిదే పంటలు పండవు. లోకంలో వెలుగులు ఉండవు. అందుకే ఆయన అంతటి ప్రాధాన్యం ఉంటుంది.
సూర్యారాధనతో ఫలితాలు
- పెళ్లికాని యువతీ యువకులకు పెళ్లి జరుగుతుంది.
- సంతాన భాగ్యం కలుగుతుంది.
- విద్య, వ్యాపారాలలో వికాసం జరుగుతుంది.
- మానసిక శాంతి చేకూరుతుంది.
- ఆరోగ్య భాగ్యం లభిస్తుంది.
- ఇంట్లో సుఖ సంపదలు ఉంటాయి.
Also Read :Hindenburg Research : హిండెన్‌బర్గ్ నివేదిక అవాస్తవం.. అదానీ గ్రూపుతో సంబంధం లేదు : సెబీ ఛైర్‌పర్సన్
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.