సూర్యగ్రహణం కారణంగా తిరుమల ఆలయాన్ని మంగళవారం (రేపు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. గ్రహణం అనంతరం ఆలయాన్ని శుభ్రపరిచి సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా.. మంగళవారం సూర్యగ్రహణం కారణంగా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుండి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందన్నారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, కైంకర్యాలు చేపడతామన్నారు. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయని, ఆ రోజు కూడా బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసిందని అధికారులు తెలిపారు. గ్రహణం రోజుల్లో దేవాలయాలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో అన్నప్రసాదం పంపిణీ కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది.