హిందువులకు తొలి ఏకాదశి పవిత్రమైన రోజు. ఈరోజున హిందువులు దేవుళ్లకు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. ఈ రోజున చేసే పూజలు, ఉపవాసాలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి ముఖ్యమైన పవిత్రమైన రోజునా కొన్ని రకాల పనులు చేయాలి మరికొన్ని చేయకూడదు అంటున్నారు పండితులు. మరి తొలి ఏకాదశి రోజు ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జులై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జులై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది.
ఉదయ తిథి ప్రకారంఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతోపాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇకపోతే తొలి ఏకాదశి రోజు చేయాల్సిన పనుల విషయానికి వస్తే.. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.
ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీ హరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి. అదేవిధంగా పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే తొలి ఏకాదశి రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితులలోనూ మద్యం మాంసాహారం వంటివి అస్సలు తీసుకోకూడదు. అలాగే అన్నాన్ని కూడా తినకూడదు. ఉపవాసం ఉండడం మంచిది. స్త్రీలను పెద్దలను అవమానించడం, అగౌరవపరచడం లాంటివి చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలో తెంపకూడదు. అలాగే ఉపవాసం ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. వెంట్రుకలు గోళ్లు కత్తిరించడం లాంటి వ్యాస్తులు చేయకూడదు.