Site icon HashtagU Telugu

Nava Ratri 2022: ఈ నవరాత్రులకు గజవాహనంపై దుర్గా మాత.. ఏం జరగబోతోందో తెలుసా?

Durga Matha

Durga Matha

దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత సమీపించాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు 9 రోజులు 9 రూపాల్లో 9 వాహనాలపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది నవరాత్రులు మొదలయ్యే రోజును బట్టి ఒక్కో వాహనం పై అమ్మవారు భూమిపైకి వస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈసారి సోమవారం రోజున గజ వాహనం పై దుర్గామాత వస్తున్నారు.

*ఏ రోజుల్లో.. ఏ వాహనం?

ఆదివారం, సోమవారం రోజుల్లో నవరాత్రులు ప్రారంభం అయినప్పుడల్లా అమ్మవారు గజ వాహనం పైనే వస్తారని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. గురు, శుక్ర వారాల్లో నవరాత్రులు ప్రారంభం అయినప్పుడల్లా అమ్మవారు పల్లకీ వాహనం పై వస్తారు. మంగళ, శని వారాల్లో నవరాత్రులు ప్రారంభం అయినప్పుడల్లా అమ్మవారు అశ్వ వాహనం పై వస్తారు. బుధవారం రోజు నవరాత్రులు ప్రారంభం అయినప్పుడల్లా అమ్మవారు నౌకా వాహనం పై వస్తారు.

* గజ వాహనంపై దుర్గమ్మ వస్తే ఏమవుతుంది?

గజ వాహనంపై దుర్గమ్మ రావడం శుభ సంకేతం. వర్షాలు కురిసే అవకాశాలు ముమ్మరంగా ఉంటాయి. ఈ వర్షాల వల్ల చుట్టూ పచ్చదనం ఆవరిస్తుంది. ప్రకృతి అందాలు ఇనుమడిస్తాయి. పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. అన్నం, ధనంతో కూడిన భాండారాలు నిండిపోతాయి. ధన, ధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఏనుగు, నౌకపై అమ్మవారు రావడాన్ని శుభంగా పరిగణిస్తారు.

* అమ్మవారిని పూజించే విధానం

ముందుగా విఘ్నేశ్వర పూజను చేయాలి. రక్షాబంధన, కలశ పూజ చెయ్యాలి. ప్రాణప్రతిష్ట కరన్యాసములు చేయాలి. సహస్రనామములతో, త్రిశతీ నామములతో, అష్టోత్తర శతనామాలతో, దేవి ఖడ్గమాల నామములతో, పసుపు, కుంకుమ, హరిద్రాక్షతలు, కుంకుమాక్షతలు, రక్త చందనాక్షతలు, శ్రీచందనాక్షతలు, బిల్వదళములు, తులసిదళములు, పరిమళ పుష్పాలతో అర్చన చేయాలి.

* అమ్మవారిని ఆరాధించే విధానం

తొమ్మిది అవతారాలలో అలంకరించుకొని పూజించాలి. సింహవాహనంపై అష్టభుజాలతో, అష్టవిధ ఆయుధాలతో సౌమ్య స్వరూపిణిగా చతుర్భుజాలతో సింహాసనంపై కూర్చొని శిరస్సుపై కిరీటంలో చంద్ర వంకను ధరించిన అమ్మవారి విగ్రహాన్ని స్థాపించుకొని నిత్యం పూజలు చేయాలి.అమ్మవారికి ఇష్టమైన ఫలములను, చలివిడి, వడపప్పు, పానకము, తేనె, పంచదార, పెరుగు సమర్పించి మంగళహారతి ఇచ్చి అమ్మవారిని నమస్కరించుకోవాలి

*పూజ ఫలితం కోసం..

అమ్మవారికి ఇష్టమైన దేవి భాగవత, సౌందర్యలహరి పారాయణలను చేసుకోవాలి. కొన్ని అర్చనలతో నిత్యం అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన భజన గీతాలను వినిపించాలి. సహస్ర నామాలను స్మరించాలి. నిత్యం అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి. హోమాలు చేయడంవల్ల అమ్మవారికి సంతృప్తి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.