Site icon HashtagU Telugu

Lord Vishnu : విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది..

Srikurmam Lord Vishnu

Srikurmam

మహావిష్ణువు (Lord Vishnu) అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది. కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మధనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం.

ఎన్నో అరుదైన ప్రదేశాలకు, విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఇక్కడి అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి. ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం ‘శ్రీకూర్మం’. మహావిష్ణువు (Lord Vishnu) కూర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీ కూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాధ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకూ ఇక్కడ ప్రతీదీ ప్రత్యేకమే. అసలు శ్రీ కూర్మం యొక్క చరిత్ర ఏమిటి? అక్కడి విశేషాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. కానీ పురాణాల కధనం ఈ విధంగా ఉంది. పూర్వం శ్వేతచక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురమనే పట్టణంను పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఓ వైపు భర్త.. మరో వైపు భక్తి.. ఈ సంకట స్థితి నుంచి తనను బయట పడేయాలని విష్ణువును వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆడుకోమని ప్రార్ధిస్తుంది.

ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరుగిడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఖిఃస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటూ విష్ణువును పూజించగా ఓ రోజు మహావిష్ణువు (Lord Vishnu) కూర్మావతారంలో చక్రతీర్ధ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఓ వటవృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు. చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్ష్యమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మి సమేత శ్రీ కూర్మనాధునిగా స్వామి వారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు.

ఆలయానికి శాపం:

ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన బైరవుడు ఆయనను లోనికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు.

ఆలయ విశిష్టతలు:

శ్రీకూర్మంలో స్వామి వారి విగ్రహం పడమటి ముఖంగా ఉండడం విశేషం. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్ధానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. కళింగ, ఆంధ్ర, చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. 7వ శతాబ్ధం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపాద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు, కీర్తిని చాటిచెబుతాయి.

ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏక శిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటికి ఒక దానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాధ స్వామి దర్శనమిస్తారు. అడుగు ఎత్తు, ఐదడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో స్వామి వారి విగ్రహం ఉంటుంది. నిత్యం స్వామి వారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో శ్రీ వరదరాజ స్వామి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, కోదండ రామ స్వామి ఆలయాలు కూడా ఉంటాయి.

విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఎలా వెళ్లాలి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది. ఇతరాల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి విమానమార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖ నుంచి శ్రీకూర్మం 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం పట్టణం నుంచి ప్రతి 15 నిమిషాలకు ఇక్కడికి బస్సు రవాణా సౌకర్యం కలదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. బస్సు, ఆటోలు, ట్యాక్సీల ద్వారా పర్యాటకులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

Also Read:  Venkateswara Swamy : వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం – దర్శన సమయాలు, చరిత్ర