Site icon HashtagU Telugu

History of Srisailam Peak : శ్రీశైలం శిఖర దర్శనం చరిత్ర ఇది..!

Srisailam Peak Darshanam

Srisailam Peak Darshanam

శ్రీశైలం శిఖర (Srisailam Peak) దర్శనం చరిత్ర:

శ్రీశైలంలో శిఖరేశ్వరం (Srisailam Peak) ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి.

అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని.

అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది.

అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది.

అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం (Srisailam Peak) దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.

Also Read:  TTD : 2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు

Exit mobile version