అనంత విశ్వానికి మూలమైన అమ్మవారి (dasa mahavidya) దశ మహా విద్యలు ఇవే!

మనం అమ్మవారిని ఎన్నో రూపాల్లో పూజిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి త్రిదేవీలు, నవదుర్గలు. కానీ వీటన్నింటికైన శక్తివంతమైన దశమహావిద్యలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి అమ్మవారి యొక్క తాంత్రిక స్వరూపాలు. ఇందులో అత్యంత ఉగ్ర రూపమైన కాళికా దేవి నుంచి అత్యంత సౌమ్యమైన త్రిపుర సుందరి వరకు ఉన్నారు. ఈ దశమహావిద్యలను తాంత్రిక రూపాల్లో పూజిస్తారు. తనువుతో చేసే సాధన విధానాన్నే తంత్ర పద్ధతి అంటారు. ఆ పూజలనే తాంత్రిక పూజలు అంటారు. ఆదిపరాశక్తికి […]

Published By: HashtagU Telugu Desk
Dasa Copy

Dasa Copy

మనం అమ్మవారిని ఎన్నో రూపాల్లో పూజిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి త్రిదేవీలు, నవదుర్గలు. కానీ వీటన్నింటికైన శక్తివంతమైన దశమహావిద్యలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి అమ్మవారి యొక్క తాంత్రిక స్వరూపాలు. ఇందులో అత్యంత ఉగ్ర రూపమైన కాళికా దేవి నుంచి అత్యంత సౌమ్యమైన త్రిపుర సుందరి వరకు ఉన్నారు. ఈ దశమహావిద్యలను తాంత్రిక రూపాల్లో పూజిస్తారు. తనువుతో చేసే సాధన విధానాన్నే తంత్ర పద్ధతి అంటారు. ఆ పూజలనే తాంత్రిక పూజలు అంటారు.

ఆదిపరాశక్తికి ప్రతిరూపమైన పురుషతత్వం శివుడే అయినా ఈ విశ్వాన్ని మొదలు పెట్టింది మాత్రం ఆదిపరాశక్తి అమ్మవారు. అలా మొదలైన ఈ విశ్వంలో అతి పెద్ద నక్షత్రాల నుంచి చిన్న చిన్న ఇసుక రేణువుల్లో కూడా ఆ శక్తి నిక్షిప్తమై ఉంది. విశ్వాన్ని నడిపించడానికి, పనులు సక్రమంగా జరగడానికి ఆ శక్తి నుంచి కొంత మంది దేవీ దేవతలు ఉద్భవించారట. కానీ పుట్టకతోని మనలో ఉండేది ముగ్గురు మాత్రమే అట. ఒకరు విష్ణుమూర్తి.. ఈయన ఈ విశ్వాన్నే నడిపిస్తూ.. అన్నింటినీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విశ్వం ఉన్నంత వరకూ ఆయన ఉంటారు. ఇక రెండోది ఆదిపరాశక్తి అమ్మవారు. ఈ అమ్మవారిలో ఒక భాగమే మనం. ఇక మూడోది శివుడు. ఈయన అమ్మవారి యొక్క పురుషతత్వం. కాబట్టి ఈయన అమ్మవారు ఎక్కడ ఉంటారో అక్కడ శివుడు ఖచ్చితంగా ఉంటారట. ఈ నేపథ్యంలో సృష్టికి మూలమైన అమ్మవారి దశ రూపాలు.. దశమహావిద్యలు గురించి తెలుసుకుందాం.

శ్రీ మహాకాళీ

Mahakali..

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీ దేవి దశమహావిద్యల్లో మొదటి విద్య. ఈమె శక్తి, వినాశం, పరివర్తనకు ప్రతిరూపం. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి శ్రీకాళీ దేవికి ప్రీతికరమైనదిగా చెబుతారు. అలాగే శ్రీకాళీ దేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా పండితులు చెబుతారు. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల బాధల నుంచి, వ్యాధుల నుంచి విముక్తి కలుగుతందట. అంతే కాకుండా పూజకుడికి శత్రుపీడ తొలగి.. దీర్ఘాయువు కలుగుతుందట.

శ్రీ తారా దేవి

Tara Devi

దశ మహావిద్యల్లో రెండో మహా విద్య శ్రీతారాదేవి. అమ్మవారి ఈ రూపం కరుణ, రక్షణకు ప్రతిరూపం. నీలవర్ణంతో ప్రకాశించే ఈ దేవికి చైత్రమాసం శుక్ల పక్ష నవమి తిథి మహా ప్రీతిపాత్రమైంది. శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత. తారా దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రు నాశనం, దివ్య జ్ఞానం, వాక్సుద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ వంటివి సాధకుడికి లభిస్తాయట.

శ్రీ త్రిపుర సుందరి దేవి

Sri Lalita Tripura Sundari

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ త్రిపుర సుందరి దేవి దశమహావిద్యల్లో మూడో మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. ఈమె అందం, సంపద, సౌందర్య దేవత. శాంతి స్వరూపిణి అయిన ఈ త్రిపుర సుందరి దేవికి మార్గశిర మాసం పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత త్రిపుర సుందరి అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని కూడా అంటారు. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి ఈ మహావిద్యని ఉపాసిస్తే సాధకుడికి కష్టనష్టాల నుంచి విముక్తి మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయట.

 శ్రీ భువనేశ్వరి దేవి

Shri Bhuvaneshwari Devi

దశ మహావిద్యల్లో నాలుగో మహావిద్య శ్రీ భువనేశ్వరీ దేవి. ఈమె విశ్వాసానికి అధిపతి, సృష్టికి మూలం. ఉదయించే సూర్యుడి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్ల పక్ష అష్టమి తిథి మహా ప్రీతిపాత్రమైనది. శ్రీ భువనేశ్వరి దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ శ్రీ భువనేశ్వరి దేవి భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుందట. అలాగే.. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి కూడా లభిస్తుందట. అంతేకాదు రాజ్యధికారాన్ని, సమస్త సిద్దుల్ని, సకల సుఖ భోగాల్ని పొందుతారట.

శ్రీ భైరవి

Sribhairavi

దశమహావిద్యల్లో ఐదో మహా విద్య శ్రీ భైరవి. వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీత్రిపురభైరవీదేవి. ఈ దివ్య శక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్ణిమ తిథి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే సకల సుఖ భోగాలను పొందే శక్తి, జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుందట.

 శ్రీ ఛిన్నమస్తాదేవి

Chinnamasta Devi

దశ మహావిద్యల్లో ఆరో మహావిద్య శ్రీఛిన్నమస్తాదేవి. ఈ ఛిన్నమస్తాదేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా అంటారు. వైశాఖ మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి ఛిన్నమస్తాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. శాక్తేయ సంప్రదాయంలో ఛిన్నమస్తాదేవికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఛిన్నమస్తాదేవిని భక్తి శ్రద్ధలతో నిష్టతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రు విజయం, రాజ్యప్రాప్తి, పూర్వ జన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుందట. అంతే కాకుండా ఎలాంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ ఛిన్నమస్తాదేవి ప్రసాదిస్తుందట.

శ్రీ ధూమావతి

Dhumavati

దశ మహావిద్యల్లో ఏడో మహావిద్య శ్రీ ధూమావతి. ధూమ వర్ణంతో దర్శనం ఇచ్చే ధూమవతి దేవి వితంతు దేవత. జ్యేష్ఠమాసం శుక్ల పక్ష అష్టమి తిథి ఈ ధూమవతి దేవికి మహా ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాలను, దరిద్రాలను ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందట. ఈ ధూమావతీ దేవి ఆరాధన వల్ల సాధకుడికి అనేక వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుందట.

 శ్రీ బగళాముఖి

Bagalamukhi

దశ మహావిద్యల్లో ఎనిమిదో మహావిద్య పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళాముఖీ దేవికి చెందింది. ఈమె శత్రువులను స్తంభింపజేస్తుంది. స్తంభన దేవతగా ప్రసిద్ధి చెందిన ఈ బగళాముఖీ దేవికి వైశాఖ మాసం శుక్ల పక్ష అష్టమి తిథి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ బగళాముఖీ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుందట. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాదనల విషయాల్లో ఎదుటి పక్షం వారి మాటల్ని స్థంభింపచేసి విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుందట.

శ్రీ మాతంగి

Matangi

దశ మహావిద్యల్లో తొమ్మిదో మహావిద్య శ్రీమాతంగి. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీమాతంగి దేవికి చెందింది. ఈమె జ్ఞానం, కళలు, సరస్వతి రూపం. వశీకరణ దేవతగా ప్రశస్తి చెందిన మాతంగి దేవికి వైశాఖమాసం శుక్ల పక్ష తృతీయ తిథి మహా ప్రీతిపాత్రమైనది. రాజమాతంగి, లఘు శ్యామలా, ఉచ్చిష్టచండాలి అనే పేర్లతో కూడా ఈ మాతంగి దేవిని పిలుస్తుంటారు. ఈ మాతంగి దివ్య స్వరూపిణి ఉసాసన వల్ల వాక్సుద్ధి, వశీకరణ శక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయట.

శ్రీ కమలాత్మిక

Kamalatmika

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికా దేవి దశ మహావిద్యలలో పదో మహావిద్యగా ప్రశస్తి పొందింది. ఈమె సంపద, సమృద్ధి, లక్ష్మీరూపం. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన కమలాత్మిక దేవికి మార్గశిర అమావాస్య తిథి మహా ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి. శాంత స్వరూపిణి అయిన ఈ కమలాత్మిక మహావిద్యని ఉపాసిస్తే సకల సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాలను సాధకుడికి శ్రీ కమలాత్మికా దేవి ప్రసాదిస్తుందట.

  Last Updated: 24 Dec 2025, 04:30 PM IST