రేపే వినాయక చవితి.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు. అయితే వినాయక చవితి అనగానే మనకు గరక అలాగే ఉండ్రాళ్ళు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా దూర్వాంకురాలతో పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు లభిస్తాయి అంటున్నారు పండితులు. మరి దూర్వాంకురాలతో గణపతిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?ఏ విధంగా పూజించాలి అన్న వివరాల్లోకి వెళితే.. విఘ్నేశ్వరుడి పూజలో గరిక లేకుండా ఎన్ని పత్రాలు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా కూడా పూజాఫలం దక్కదు అని అంటూ ఉంటారు.
అయితే దీని వెనుక ఒక కథ కూడా ఉంది.. పూర్వం ఒకరోజు దేవతలంతా సభలో ఉండగా అతిలోకసుందరి తిలోత్తమ నాట్యం చేస్తోందట. ఇంతలో ఆమె చీరచెంగు జారిపోయింది. సభలోనే ఉన్న యమధర్మరాజు ఆమె సౌందర్యానికి పరవశుడై కౌగలించుకోవాలని లేచాడు. ఆ మరుక్షణమే, అది సంస్కారం కాదని తెలుసుకుని తలవంచుకుని వెనక్కివెళ్లిపోయాడు. అయితే, అప్పటికే స్ఖలితమైన అతడి వీర్యం భూమిపై పడింది. దాన్నించి అగ్నిజ్వాలవలే మండే అనలాసురుడు పుట్టాడు. ఆ రాక్షసుడు తన వాడివేడి కోరల నోరు తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు. దాంతో ముల్లోకాలూ వణికిపోయాయి. దేవతలందరూ విష్ణుమూర్తి శరణు కోరారు. విష్ణువు గణేశుణ్ణి ప్రార్థించమన్నాడు. విఘ్నస్వరూపుడైన గణపతిదేవా నమోనమస్తే.. అంటూ ఆర్తితో దేవతలు స్తుతించగా గణపతి బాలగణపతిగా సాక్షాత్కరించాడు.
ఆ వెంటనే అనలాసురుడు దాడిచేయడానికి రాగా బాలగణేశుడు తన మాయాబలంతో ఆ రాక్షసుణ్ని పట్టేసి మింగేశాడు. అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాలగజాననుడి తాపోపశమనానికి ఇంద్రుడు చంద్రుని కళని ఇచ్చాడు. అందుకే అప్పటినుంచి గణేశుడికి ఫాలచంద్రుడన్న పేరు వచ్చింది. విష్ణుమూర్తి పద్మాన్ని ఇచ్చాడు. అప్పటికీ తాపం శాంతించకపోవడంతో వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడట. శంకరుడు శేషుడిని ఇవ్వగా దానితో బంధింపబడిన ఉదరము కలిగినవాడై వ్యాళబద్ధుడయ్యాడు. అయినా తాపోపశమనం కలగలేదు. సరిగ్గా అదే సమయంలో 8,800 మంది మునీశ్వరులు ఒక్కొక్కరూ 21 గడ్డి పోచలను భక్తితో సమర్పించారు. అప్పుడు గణేశుడి తాపం ఉపశమించింది. అది తెలుసుకున్న దేవతలు దూర్వాంకురాలతో పూజించి గజాననుణ్ణి సంతుష్టిపరిచారు.
అప్పుడు వినాయకుడు నా పూజలో ముఖ్యమైనవి ఈ గడ్డిపోచలే. ఇవి లేని పూజవల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల ఒకటి లేదా 21 దూర్వాంకురాలతో పూజచేస్తే నేను సంతుష్టుణ్ణవుతాను. దీని ఫలితం నూరు యజ్ఞాలవల్ల గానీ దానాదికములవల్ల గానీ ఉగ్ర తపోనిష్ఠవల్ల గానీ సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్లు అధికం అని తెలిపారు. గణపతికి గరికతో ఉపశమనం కలిగింది అన్న విషయంలో శాస్త్రీయ దృక్కోణం కూడా దాగి ఉంది. గరికపోచలపై పల్చని సిలికా అనే పదార్థం రక్షణకవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. అగ్నిసంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ని మింగేయడం వల్ల లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు హరించగలిగాయి. ఈ కారణం వల్లే శాస్త్రరంగంలోనూ ఉష్ణనిరోధక పదార్థాల్ని సిలికాతో తయారుచేస్తుంటారు. కాబట్టి విగ్నేశ్వరుడికి మనం ఏది సమర్పించిన సమర్పించక పోయిన గరిక అర్పించడం అన్నది తప్పనిసరి. విగ్నేశ్వరుడిలో పూజలో గరిక లేకపోతే ఆ పూజ వ్యర్థం.
కాబట్టి ఆ గణనాథుడి ఆశీస్సులు మనకు లభించాలి అంటే తప్పకుండా ఆయన పూజలో గరికను ఉపయోగించాల్సిందే. అదేవిధంగా ఇటువంటి విగ్రహం అయితే మంచిది అన్న విషయానికి వస్తే కేవలం పూజకు మట్టి విగ్రహాన్ని మాత్రమే ఉపయోగించాలి.. గంగలోని మట్టితో విగ్రహం చేసి వినాయకచతుర్థినాడు పూజించి మర్నాడు మళ్లీ ఆ గంగలోనే కలపాలి. ఆ విధంగా సంవత్సరానిమీ ఒకసారి గంగాదేవిని గౌరవించుకుంటాననీ గణపతి దేవతలతో అన్నాడట. కనుక మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి. చవితి మర్నాడు శుక్ర లేక మంగళవారం అయితే మాత్రం రెండోరోజు కాకుండా మూడోరోజు స్వామిని నిమజ్జనం చేయాలి.