Ashadam: ఆషాడమాసంలో కొత్త పెళ్లికూతురు అత్తగారింట్లో ఎందుకు ఉండకూడదో తెలుసా?

పూర్వీకుల కాలం నుంచి హిందువులు కొన్ని రకాల విషయాలను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తూనే వస్తున్నారు. చాలామంది పిల్లలు వారి పెద్దలు చె

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 08:25 AM IST

పూర్వీకుల కాలం నుంచి హిందువులు కొన్ని రకాల విషయాలను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తూనే వస్తున్నారు. చాలామంది పిల్లలు వారి పెద్దలు చెప్పిన విషయాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉండగా మరి కొంతమంది వాటిని మూఢనమ్మకాలు అని కొట్టి పరుస్తూ ఉంటారు. ఇక మన పూర్వీకులు చెప్పిన వాటిలో కొత్తగా పెళ్లయిన జంట ముఖ్యంగా ఆషాడమాసంలో కలిసి ఉండకూడదు అన్న ఆచారం కూడా ఒకటి. కేవలం కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు. అలాగే ఆషాడంలో కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదన్న సాంప్రదాయ నియమం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. ఈ కాలం యువతీ యువకులకు దీనిపై అంతగా అవగాహన లేదు కానీ, ఇదివరకటి రోజుల్లో దీన్ని కచ్చితంగా పాటించేవారు.

ఆచార సాంప్రదాయాలను కచ్చితంగా పాటించే కొన్ని కుటుంబాలు ఇప్పటికీ దీన్ని పాటిస్తున్నారు. ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్త ముఖం ఎందుకు చూడకూడదు అన్న ప్రశ్న చాలామందికి తలెత్తే ఉంటుంది. మరి ఈ విషయం గురించి మన పూర్వీకులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొత్తగా పెళ్లయిన జంటను వారి మోహ ప్రపంచం నుంచి కాస్త బయటకు తీసుకురావడానికి ఆషాడం పేరుతో కొంత గ్యాప్ ఇస్తారు. తద్వారా ఇద్దరి మధ్య కాస్త ఎడబాటు ఏర్పడి మరింత విరహ వేదన ఏర్పడుతుంది. అది ఇద్దరి మధ్య బలమైన సంబంధానికి, దాంపత్యానికి దారితీస్తుందని పెద్దల నమ్మకం. అలాగే ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయం.

ఇదివరకు చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడ్డవే అన్న సంగతి తెలిసిందే. ఇక ఆషాడ మాసం పక్షం రోజులు ముందే జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. వర్ష కాలం ప్రారంభమయ్యే సమయం కాబట్టి అపుడే దుక్కి దున్నడం మొదలు పెడతారు. కాబట్టి కొత్తగా పెళ్లయిన పురుషుడు భార్య పక్కనే ఉంటే ఇతర పనులపై శ్రద్ద పెట్టలేడు. కాబట్టి వైవాహిక జీవితం నుంచి అతని ధ్యాస మళ్లించేందుకు భార్యను పుట్టింటికి పంపించేవారు. ఇందుకోసం కోడలు అత్త ముఖం చూడకూడదు అన్న ఒక నియమాన్ని పెట్టారు. అదేవిధంగా ఆషాడంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. మన తాతలు,తండ్రుల కాలంలో ఇదివరకటిలా ఫ్యాన్లు,కూలర్లు,ఏసీలు అందుబాటులో లేవు కాబట్టి,ఆ సమయంలో ప్రసవమైతే తల్లీ బిడ్డ చాలా ఇబ్బందులు పడేవారు. సాధారణ ప్రసవం జరిగిన మహిళకు ఆరోగ్యపరంగా మరింత ఇబ్బంది ఉండేది. కాబట్టి సాంప్రదాయ నియమం పేరుతో ఆషాడంలో భార్యాభర్తలను వేరుగా ఉంచేందుకు కోడలు అత్త ముఖం చూడకూడదు అన్న నియమాన్ని తీసుకొచ్చారు.