Site icon HashtagU Telugu

Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

Lunar Eclipse

Lunar Eclipse

Lunar Eclipse: సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతున్న నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన కొన్ని నియమాలు, జాగ్రత్తల గురించి జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వైజ్ఞానికంగా గ్రహణం ఒక ఖగోళ సంఘటన అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రం, సాంస్కృతిక విశ్వాసాల ప్రకారం గర్భిణీలు కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల వారికి పుట్టబోయే బిడ్డకు మంచి జరుగుతుందని నమ్ముతారు.

గ్రహణం రోజు గర్భిణీలు చేయకూడనివి

బయటకు వెళ్లడం మానుకోవాలి: గ్రహణం సమయంలో గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లడం పూర్తిగా మానుకోవాలి. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో వెలువడే ప్రతికూల శక్తులు గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. దీనివల్ల శిశువు ఆరోగ్యానికి హాని జరగొచ్చు.

వంట చేయడం, తినడం మానుకోవాలి: గ్రహణం ప్రారంభమైన తర్వాత ఆహారం వండటం, తినడం చేయకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఆహారం కలుషితం అవుతుందని, దానిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు. వండిన ఆహార పదార్థాలు, నీటిలో దర్భ లేదా తులసి ఆకులను వేయడం ద్వారా వాటిని గ్రహణ ప్రభావం నుంచి రక్షించవచ్చు.

పదునైన వస్తువులను ఉపయోగించకూడదు: కత్తి, సూది, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల పుట్టబోయే శిశువు శరీర భాగాలపై గుర్తులేర్పడే అవకాశం ఉందని నమ్ముతారు.

నిద్రపోకూడదు: గ్రహణం సమయంలో నిద్రపోకుండా ఉండాలని చెబుతారు. ఈ సమయాన్ని ధ్యానం, ప్రార్థనలకు ఉపయోగించుకోవాలని సూచిస్తారు.

Also Read: Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

గ్రహణం రోజు గర్భిణీలు చేయాల్సినవి

గర్భ రక్షా స్తోత్రాన్ని పఠించాలి: గర్భవతులు గర్భ రక్షా స్తోత్రం, శ్రీ విష్ణు సహస్రనామం లేదా ఇతర మంత్రాలను పఠించడం మంచిది. దీనివల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, శిశువుకు రక్షణ లభిస్తుంది.

శుభ్రత పాటించాలి: గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. దీంతో గ్రహణ ప్రభావం నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

పండ్లు, తాజా కూరగాయలు తినాలి: గ్రహణం ముగిసిన తర్వాత తాజా పండ్లు లేదా వండిన ఆహారాన్ని తినాలి. ఇది శరీరంలో శక్తిని తిరిగి నింపుతుంది.

దానం చేయాలి: గ్రహణం అనంతరం దానధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు.

జ్యోతిష్యం, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ నియమాలు గర్భిణీలు, వారి శిశువులకు రక్షణ కల్పిస్తాయని నమ్ముతారు. అయితే, వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.