Yama Temple : యముడిని ‘యమ ధర్మరాజు’ అని కూడా పిలుస్తారు. ధర్మంలో యముడిని మించిన మహా దేవత మరొకరు లేరు. ఆయన పేద, ధనిక అనే తేడా లేకుండా మానవాళికి సమానత్వంతో మరణాన్ని ప్రసాదిస్తారు. మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పాపాలు చేసిన వారు యమ ధర్మరాజు విధించే శిక్షల నుంచి తప్పించుకోలేరు. ఇంతటి మహిమలు, ప్రాముఖ్యత కలిగిన యమ ధర్మరాజుకు కూడా మన దేశంలో ఒకచోట ఆలయం ఉంది. ఎక్కడో తెలుసా ? కరీంనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని ధర్మపురి పట్టణంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంతో పాటే యమధర్మరాజు ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి వెయ్యి సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ దర్శనానికి వచ్చేవారు తొలుత యమధర్మరాజుకే పూజలు చేస్తుంటారు. ఆ తర్వాతే నరసింహస్వామిని దర్శించుకుంటారు. యముడి ఆలయంలో పెద్ద పెద్ద కోరలు, చేతులు, యమదండంతో భీకరంగా ఉన్న యముడి విగ్రహం ఉంది.
ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజున వచ్చే యమ ద్వితీయ, వేసవి కాలంలో వచ్చే భరణి నక్షత్రం నాడు భక్తులు ధర్మపురిలోని యముడి ఆలయానికి పెద్దసంఖ్యలో వస్తుంటారు. యమ ద్వితీయ రోజున యముడు తన సోదరి యమునా దేవి ఇంటికి భోజనానికి వెళ్లాడని నమ్ముతారు. అందుకే ఆ రోజున యముడికి పూజలు చేయడానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. యమ ద్వితీయ రోజున ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని యముడు వరమిస్తాడని విశ్వసిస్తారు. అలా చేస్తే.. అకాల మరణం కూడా సంభవించదని చెబుతుంటారు.
Also Read: First Visuals : సొరంగంలోని 41 మంది కార్మికుల విజువల్స్ ఇవిగో..
యమ ద్వితీయను ఉత్తర భారతదేశంలో ‘భాయిదూజ్’ అని పిలుస్తారు. ఆ రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరులను భోజనం కోసం ఇంటికి ఆహ్వానిస్తుంటారు. ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం కోసం యమ ధర్మ రాజుకు మన్యు సూక్తం, ఆయుష్య సూక్తం, అభిషేకం, ఆరతి, మంత్ర పుష్పం, రుద్రాభిషేకం, ఆయుష్ సూక్త హోమం వంటి ప్రత్యేక ప్రార్థనలు(Yama Temple) కూడా చేయొచ్చు.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.