Nishkalank Mahadev : ప్రతి రోజూ సముద్రగర్భం నుండి ఆలయం

ఆధ్యాత్మికతకు ఆలవాలమైన భారతదేశంలో అబ్బురపరిచే వింతలు, విశేషాలెన్నో. మానవ మేధస్సుకు సైతం అంతు చిక్కని ప్రశ్నలెన్నో.

  • Written By:
  • Publish Date - January 23, 2022 / 08:00 AM IST

ఆధ్యాత్మికతకు ఆలవాలమైన భారతదేశంలో అబ్బురపరిచే వింతలు, విశేషాలెన్నో. మానవ మేధస్సుకు సైతం అంతు చిక్కని ప్రశ్నలెన్నో. పరమేశ్వరుడికి మహిమలకు తార్కాణాలుగా మన దేశంలో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. వాటిలో గుజరాత్ రాష్ట్రం, భావ్ నగర్ కు సమీపంలోని కొలియాక్ సముద్ర తీరంలో ఉన్న నిష్కళంక్ మహదేవ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం ప్రత్యేకత గురించి తెలిస్తే ఆ ప్రాంతాన్ని సందర్శించాలనే ఉత్సుకత మీలో మరింత పెరుగుతుంది. ఇలాంటి ఒక వింత మన దేశంలో ఉందా?? అనే ఆశ్చర్యం మీలో కలుగుతుంది. ప్రకృతి అద్భుతానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే నిష్కళంక్ మహదేవ్ ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రోజూ వెనక్కి వెళ్లే సముద్రం:
ప్రతి అమావాస్య, పౌర్ణమికి సముద్రం కాస్త ముందుకు రావడం గురించి మీరు వినే ఉంటారు. కానీ ప్రతి రోజూ సముద్రం కిలోమీటరుకు పైగా కొన్ని గంటల పాటు వెనక్కి వెళ్లడం గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు. నిష్కళంక్ మహదేవ్ ఆలయాన్ని సందర్శించాలంటే ఈ అద్భుతం ప్రతి రోజూ జరగాల్సిందే. ఎందుకంటే ఈ ఆలయం సముద్ర గర్భంలో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల ప్రాంతం నుండి సముద్రం వెనక్కి వెళ్లడం ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట సమయానికి పూర్తిగా వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లి నిష్కళంక్ మహదేవ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ మొత్తం ఐదు స్వయంభు శివలింగాలు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో చిన్న నీళ్ల కుంట కూడా ఉంటుంది. ఈ నీటితోనే భక్తులు శివలింగాలను అభిషేకిస్తారు.సాయంత్రం దాదాపు 7 గంటల వరకూ ఈ ఆలయాన్ని దర్శించుకునే వీలుంటుంది. ఆ తర్వాత సముద్రం మెల్లగా ముందుకు వచ్చి ఆలయాన్ని తనలో కలిపేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం అక్కడికి వెళ్లి చూస్తే ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తప్ప ఆలయ ఛాయలు ఎక్కడా కనపడవు. ఆలయం గోపురంపై ఉండే జెండా మాత్రమే సముద్రంలో ఎగురుతూ కనిపిస్తుంది. ఈ ఆలయానికి అమావాస్య, పౌర్ణమి సమయాల్లో భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆలయ స్థల పురాణం:
కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. పురాణాల ప్రకారం, కౌరవులను వధించిన తర్వాత పాండవులు తమకు అంటిన పాపాలకు కలత చెందుతారు. వాటి నుండి విముక్తి పొందేందుకు కృష్ణుడిని సంప్రదిస్తారు. శ్రీకృష్ణుడు వారికి ఒక నల్లటి జెండా, నల్లటి ఆవును ఇచ్చి దేశాటన సాగించమంటాడు. అవి ఎక్కడైతే తెల్లటి రంగులోకి మారతాయో అప్పుడు వారి పాపాలు క్షమించబడినట్లు సెలవిస్తాడు. శ్రీకృష్ణుడి ఆదేశంతో ప్రయాణం ప్రారంభించిన పాండవులకు గుజరాత్ కొలియాక్ తీరంలో ఆవు మరియు జెండా తెల్లటి రంగులోకి మారతాయి. వెంటనే ఆ ప్రదేశంలో పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి తమ పాపాలను క్షమించమని కోరతారు. పాండవుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అక్కడ ఐదు శివలింగాలుగా ఏర్పడి వారు ఐదుగురినీ అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి కలంకాలను రూపుమాపే దైవంగా నిష్కలంక మహదేవ్ ను ప్రజలు ఆరాధిస్తున్నారు.