Site icon HashtagU Telugu

Hawks : మాంసాహారం తినే గద్దలు చక్కెర పొంగలి మాత్రమే తింటాయి. ఏంటా ఆలయం ప్రత్యేకత..!

The Temple Where The Hawks Come And Eat The Prasadam..!

The Temple Where The Hawks Come And Eat The Prasadam..!

మాంసాహారం తినే గద్దలు (Hawks) అక్కడ చక్కెర పొంగలి మాత్రమే తింటాయి. ఎక్కడినుంచి వస్తాయో, ఎక్కడికి వెళతాయో తెలియదు. రోజూ భోగం పెట్టే సమయానికి రెండు గ్రద్దలు వచ్చి ప్రసాదం తిని వెళతాయి. ఏంటా ఆలయం ప్రత్యేకత..?

తమిళనాడు తిరుక్కురళ్ గుండ్రంలో ఉన్న పక్షి తీర్థం ఇది. ఇక్కడ కొండపైకి నిత్యం రెండు పక్షులు (Hawks) వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి.

పక్షులు (Hawks) వచ్చి ప్రసాదం తినివెళ్లడం వెనుక ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. అదేంటంటే…కృత యుగంలో సర్వ సంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగాలు అనుభవించాలనే కోరిక కలిగింది. తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రపంచ భోగాలు అడగడానికి కాస్త ఆలోచించిన మునులు… మీ సేవే చాలుస్వామి అన్నారు. కానీ వారి మనసులో కోరికను గ్రహించిన ముక్కంటి.. ఎనిమిది మందినీ 8 పక్షులుగా జన్మించనమన్నాడు. ఒక్కో యుగంలో ఇద్దరు రెండు పక్షుల చొప్పున నిత్యం గంగాస్నానం చేసి తన ప్రసాదం తిని వెళ్లాలన్నాడు. అలా చేస్తే ఆ తర్వాతి జన్మలో మోక్షం పొందుతారని చెప్పాడు.

We’re new on WhatsApp. Click to Join.

అలా శంకరుడి ఆజ్ఞ మేరకు ఎనిమిది మంది మునులు పక్షులుగా మారారు..

కృతయుగంలో పూష, విధాత

త్రేతాయుగంలో జటాయువు, సంపాతి

ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులు

కలియుగమున శంబర శంబరాదులు నిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం పూర్తైన తర్వాత… సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలయ్యే సరికి అర్చకులు చిన్న బిందె నిండుగా చక్కెర పొంగలి పట్టుకుని కొండపైకి వెళతాడు. బిందెమీద ఉంచిన పళ్లాన్ని తీసి గరిటెతో శబ్దం చేస్తూ కూర్చుంటాడు. పై నుంచి రెండు పక్షులు వచ్చి ఆయన పక్కన వాలతాయి. బిందెలో ఉన్న పరమాన్నాన్ని స్పూన్లతో తీసి ఆ పక్షుల ముందు ఉంచుతాడు. అవి ఆ పరమాన్నంలో రెండు, మూడుసార్లు ముక్కు ముంచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు.

ఈ పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ….మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచి చూసిన ప్రాంతంలో ఆగుతాయని అందుకే “పక్షితీర్థం”గా ప్రసిద్ధిచెందందని చెబుతారు. ఈ పక్షితీర్థం చెన్నై నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుపేరు “తిరుక్కుర కుండ్రం”. ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు.

ఈ ఆలయంలో స్వామి పేరు “భక్తవత్సలేశ్వరుడు”, అమ్మవారి పేరు “త్రిపురసుందరి”. ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. పక్షితీర్థం ఊరి మధ్యలో ఉన్న మెయిన్‌రోడ్డును ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ కొండమీదకే పక్షులు వస్తుంటాయి. సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు. కొండమీద వేదగిరీశ్వరాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని చుక్కాలమ్మగా కొలుస్తుంటారు. అయితే నిత్యం ఆ పక్షులు వస్తాయని చెప్పలేం…అప్పుడప్పుడు రాకపోవచ్చు కూడా అని చెబుతున్నారు స్థానికులు. ఏదేమైనా పక్షులు ప్రసాదం తిని వెళ్లే దృశ్యాలు చూసిన వారంతా…అంతా స్వామివారి మహిమే అంటారు…

Also Read:  Sri Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి మథుర ఎంత అద్భుతంగా ఉందో చూశారా?