Site icon HashtagU Telugu

Panchamukha Hanuman: పంచముఖ ఆంజనేయుడు.. ఆ రూపం వెనుక అసలు కథ ఇదే..

Panchamukha Hanuman

Panchamukha Hanuman

Panchamukha Hanuman: భయమేసినా.. కష్టమొచ్చినా.. మనసులో శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం అని స్మరించగానే.. నేనున్నానంటూ అభయమిచ్చే దైవం ఆంజనేయస్వామి. ఆ అంజనీపుత్రుడిని మనం అనేక రూపాల్లో ఆరాధిస్తుంటాం. ఆంజనేయస్వామికి ప్రతిరూపాలైన వానరాలను కూడా కొన్నిప్రాంతాల్లో పూజిస్తుంటారు. ఆంజనేయుడిని ఆరాధించే రూపాల్లో పంచముఖ ఆంజనేయ స్వరూపం ఒకటి. నిజానికి ఈ రూపం కల్పితం కాదు. రామాయణం జరిగినపుడు.. సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడిని కాపాడేందుకు ఆంజనేయుడు స్వయంగా ధరించిన రూపమిది. ఈ రూపం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామాయణంలో రావణుడు సీతను అపహరించి లంకకు ఎత్తుకెళ్లడం, తన భార్యను అప్పగించాలని కోరుతూ రాముడు పంపిన రాయబార ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక రామ-రావణ యుద్ధం మొదలవుతుంది. రాముడి కోపానికి రావణుడి సేనలు నశించిపోవడం మొదలవ్వగానే.. రాముడు సాధారణ మానవుడేనన్న భ్రమలో ఉన్న రావణుడిలో భయం మొదలవుతుంది. మహావీరుడైన తన కుమారుడు ఇంద్రజిత్తు చనిపోవడంతో ఆ భయం మరింత ఎక్కువవుతుంది. దాంతో పాతాళ లోకానికి అధిపతైన తన బంధువు మైరావణుని సహాయం కోరతాడు రావణుడు.

ఈ విషయం గ్రహించిన హనుమంతుడు జిత్తులమారి మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుంటాడు. వారిని రక్షించేందుకు చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తాడు. కానీ.. మైరావణుడు వాళ్ల కళ్లుగప్పి పాతాళలోకానికి అపహరించుకుపోతాడు. రామలక్ష్మణులను వెతుక్కుంటూ ఆంజనేయుడు కూడా పాతాళానికి బయల్దేరుతాడు. అక్కడ మైరావణుడి రాజ్యానికి రక్షగా నిలబడిన మకరధ్వజుడనే వింతజీవిని చూసి.. ఆంజనేయుడిల ఊహించని వాత్సల్యం కలుగుతుంది. యోగదృష్టితో చూడగా.. గతంలో సముద్రంమీదుగా వెళ్తుండగా తన శరీరం నుంచి పడిన చెమటను స్వీకరించిన ఓ జలకన్య కుమారుడే ఈ మకరధ్వజుడని గ్రహిస్తాడు.

ఆ విషయాన్ని ఆంజనేయుడు మకరధ్వజుడికి చెప్పినా.. కుమారుడు మాత్రం తన వృత్తిధర్మాన్ని అనుసరించి యుద్ధానికి సిద్ధపడతాడు. ఇద్దరి మధ్య జరిగిన భీకరపోరులో హనుమంతుడిదే విజయం. ఆ తర్వాత మైరావణుడి రాజ్యంలోకి అడుగుపెట్టిన మారుతి.. వెలుతురు ఉండగా అతడిని అంతం చేయడం సాధ్యం కాదని తెలుసుకుంటారు. అతని నగరంలో నాలుగు దిక్కులు, పై భాగంలో ఉన్న దీపాలన్నింటినీ ఆర్పివేసి.. పంచముఖ రూపాన్ని ధరించి.. 10 చేతులతో ఖడ్గం, శూలం, గద వంటి ఆయుధాలతో దాడికి దిగి సంహరిస్తాడు.

ఈ పంచముఖ ఆంజనేయస్వామిలో ఉన్న 5 ముఖాలు పంచభూతాలకు ప్రతీకలు. తూర్పున ఆంజనేయుడి రూపం అభీష్టసిద్ధినీ, దక్షిణాన నారసింహుని అవతారం విజయాన్ని, పశ్చిమాన గరుడ ప్రకాశం దీర్ఘాయుష్షునీ, ఉత్తరాన వరాహావతారం అష్టైశ్వర్యాలనూ, ఊర్థ్వముఖాన హయగ్రీవుని అంశ జ్ఞానాన్నీ కలుగజేస్తాయి.