Site icon HashtagU Telugu

Marriage Rituals: పెళ్లిలో వధువుని గంపలో ఎందుకు మోసుకొస్తారో తెలుసా?

Mixcollage 02 Jul 2024 08 03 Am 4193

Mixcollage 02 Jul 2024 08 03 Am 4193

మీరు చాలా వరకు పెళ్లిలలో గమనించి ఉంటే వధువుని గంపలో మోసుకువస్తూ ఉంటారు. మరికొందరు వధువు మేనమామలు వధువుని మోసుకుని వస్తూ ఉంటారు. అయితే నవవధువుని గంపలు తీసుకురావడం అన్నది మనం సినిమాలలో ఎక్కువగా చూసి ఉంటాం. నిజజీవితంలో కూడా చాలా మంది ఈ సంప్రదాయాన్ని ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. కానీ ఇలా ఎందుకు చేస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ముందుగా అమ్మాయితో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు.

బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం ఋషి ఋణం తీరవు. అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అనగా ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు.

మరి లక్ష్మియే కదా జీవుడికి! పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది. అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది. ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. అలాగే ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది. అలాగే అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.

అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి. కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం. ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి. ఎంతో ధార్మికంగా సంపాదించాలి. ఆయనకి సంతానం కలగాలి. ఆయన సంతోష పడిపోవాలి. ఆయన తండ్రి కావాలి, తాత కావాలి. ముత్తాత కావాలి. ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది. ఆ సంతానం నానుండి రావాలి. ధర్మ ప్రజాపత్యర్థం ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. అందుకే ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.