Site icon HashtagU Telugu

Srisailam Sikharam : శ్రీశైలంలో శిఖర దర్శనం జరిగితే.. మరో జన్మ ఉండదా ? ఆ కథేంటి ?

New Project (21)

New Project (21)

Srisailam Sikharam: మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహామహిమాన్విత శైవ క్షేత్రాల్లో శ్రీశైలం కూడా ఒకటి. ఇది కేవలం శైవక్షేత్రమే కాదు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రమిది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు భ్రమరాంబ మల్లిఖార్జున దర్శనం తర్వాత.. తప్పకుండా శిఖర దర్శనం చేసుకుంటారు. ఆ శిఖర దర్శనమైతే మరో జన్మ ఉండదనేది భక్తుల నమ్మకం. దీనివెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.

అదేంటంటే.. కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్లేందుకు ఎలాంటి దారి లేదు. అటువైపు కర్ణాటక నుంచి, ఇటు త్రిపురాంతం నుంచి వచ్చే భక్తులు.. తమకు తోచిన బాటను పట్టుకుని క్రూరమృగాలు సంచరించే నల్లమల అడవిలో బృందాలుగా నడిచి వెళ్లేవారు. ఒక్కోసారి దారిమధ్యలో భారీ వర్షం వచ్చినపుడు.. గుడివరకూ వెళ్లలేకపోయిన సందర్భాలలో దూరంగా కనిపించే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుని వెనుదిరిగేవారట.

అప్పటి కొండవీటి రెడ్డి రాజుగారైన ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలం వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయించిన తర్వాత భక్తుల రాక పెరిగింది. ఆ తర్వాత ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరేశ్వరం అనే కొండపై ఉన్న నందికొమ్ముల మధ్య నుంచి ఆలయ శిఖరాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అప్పటి నుంచి శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ లేదని ప్రతీతి. శిఖరేశ్వరం దగ్గర చిన్న నంది విగ్రహం ఉంటుంది. నందీశ్వరునిపై నువ్వులు చల్లి ఈశ్వరుడిని స్మరించి స్వామి ప్రధానాలయ శిఖరం వైపు తిప్పి నందికొమ్ముల నుంచి స్వామి ఆలయ శిఖర దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి శిఖరం కనిపిస్తే.. మళ్లీ మనిషి జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

Also Read : Durga Temple : ఇంద్ర‌కీలాద్రిపై మూలాన‌క్ష‌త్రం రోజున ప‌టిష్ట ఏర్పాట్లు.. రెండు ల‌క్ష‌ల‌కుపైగా భ‌క్తులు వ‌చ్చే ఛాన్స్‌