Bhairava Kona : శివుని తత్త్వం నుంచి ఉద్భవించిన కాలభైరవునికి సంబంధించిన ప్రముఖ ఆలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న భైరవకోన. ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే ఈ పుణ్యక్షేత్రం కొత్తపల్లి సమీపంలోని పర్వత ప్రాంతంలో ఉన్న కొండల మధ్య ఓ గుహలో వెలసింది. ఈ గుహలో భైరవుడు కొలువై ఉండటంతో ఈ ప్రాంతానికి “భైరవకోన” అనే పేరు లభించింది. ఈ గుహలో శివుడితో పాటు పార్వతీ దేవి విగ్రహం కనిపించడంతో, ఆమెను కూడా అక్కడే ప్రతిష్ఠించబడింది. అప్పటి నుంచే ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం పెరిగింది.
Read Also: Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు, ధర వివరాలీవే!
భైరవకోన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఒకే కొండలో చెక్కిన ఎనిమిది శివాలయాలను ఒకే సమయంలో దర్శించుకునే అవకాశముంది. వీటిలో ఏడు శివాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి ఉత్తరముఖంగా నిర్మించబడ్డాయి.ఈ గుహాలయాల్లో ప్రధాన దైవంగా “భార్గేశ్వరుడు” ఉన్నాడు. ఈ క్షేత్రానికి పాలకదైవంగా కాలభైరవుడు కొలువై ఉన్నాడు. భైరవుని పేరుతోనే ఈ ప్రాంతాన్ని భైరవకోనగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివలింగాలు భారతదేశంలో ప్రసిద్ధమైన ఇతర క్షేత్రాలలోని లింగాలను ప్రతిబింబిస్తున్నట్లుగా కనిపిస్తాయి.
ఒకే కొండలో చెక్కిన ఎనిమిది శివాలయాలు ఇవే..
అమరనాథ్‌లో కనిపించే శశినాగలింగం
మేరుపర్వతంలోని రుద్రలింగం
కాశీలో గంగాతీరంలో ఉన్న విశ్వేశ్వరలింగం
నాగరేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, మరియు మందరపర్వతంలోని పక్షఘాతలింగం
ఈ ఎనిమిది గుహాలలో ఉత్తరముఖంగా ఉన్న మొదటి గుహలో శశినాగలింగం దర్శించవచ్చు. ఈ గుహముందు నంది విగ్రహం కనిపిస్తుంది. ద్వారపాలకుల శిల్పాలు తలపాగాలతో అత్యంత రమణీయంగా చెక్కబడి ఉండి, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తూర్పుముఖంగా ఉన్న మిగిలిన గుహాలలో భర్గేశ్వరలింగం ముఖ్యమైనదిగా పూజలందుకుంటుంది. ఈ గుహల క్రమంలో వెనుక భాగంలో ఉన్న గుహలో భర్గేశ్వర శివలింగం ఉంది. ఈ గుహలో ప్రత్యేకత ఏమిటంటే, త్రిముఖ దుర్గ రూపంలో – కుడివైపు ముఖంలో జ్వాలలతో మహాకాళి, మధ్యన మహాలక్ష్మి, ఎడమవైపు సరస్వతి దేవిని దర్శించవచ్చు. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేటిలో కార్తీక పౌర్ణమినాడు చంద్రకిరణాలు అమ్మవారి ముఖంపై పడే దృశ్యం భక్తులకు పరమానందాన్ని ఇస్తుంది. ఆలయ సమీపంలో భైరవుడికి ప్రతిష్ఠించిన మరో ఆలయం ఉంది. ఎనిమిదో గుహలో ఉన్న భైరవలింగాన్ని “అష్టకాల ప్రచండ భైరవ లింగం”గా పిలుస్తారు.
భైరవకోన పరిపూర్ణమైన ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలు, పురాతన శిల్పకళకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలోని ఓ కొండపై “లింగాలదొరువు” అనే ప్రదేశంలో జన్మించిన గంగమ్మ జలపాతం రూపంలో భైరవకోన వద్ద భక్తులకు కనువిందు చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న సోమనాథ, పాల, కళింగదోనలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు కూడా పర్యాటకులకు చూడదగినవి. ఈ ప్రాంతం అటవీప్రాంతమైనందున నడవగల సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే ఈ గుహాలను సందర్శించడం సాధ్యమవుతుంది. ప్రాకాశం జిల్లాలోని కొత్తపల్లి కొండల్లో ఉన్న ఈ భైరవకోనకు చేరుకోవాలంటే పామూరు, చంద్రశేఖరపురం నుంచి సీతారాంపురం లేదా అంబవరం మీదుగా కొత్తపల్లికి బస్సు, ఆటోలు, కార్ల సదుపాయం ఉంది. సమీప రైల్వే స్టేషన్ ఒంగోలు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం వెయ్యి నుంచి 1500 మంది భక్తులు భైరవకోనను దర్శిస్తుంటారు. కార్తీకమాసం మొత్తం ఈ ప్రాంతం భక్తుల రాకతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా పౌర్ణమినాడు సుమారు 50 వేల భక్తులు శివుని మరియు కాలభైరవుని దర్శించుకుంటారు.
Read Also: Mobile Safety Tips in Rain : వర్షాకాలంలో ఫోన్ తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏ టిప్స్ ఫాలో అయితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.!