Site icon HashtagU Telugu

‎Karthika Pournami: కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ముక్కోటి దేవతల అనుగ్రహం కలగడం ఖాయం!

Karthika Pournami

Karthika Pournami

Karthika Pournami: హిందువులు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా బావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన 365 వత్తులతో దీపం వెలిగిస్తే గతంలో చేసిన దోషాలు, ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేయలేని లోపం పరిహారం అవుతాయి. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేసి శివకేశవులను పూజిస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగం.

‎అయితే ప్రస్తుత కలియుగ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడదు. ఒకరోజు దీపం పెట్టి, మరోరోజు పెట్టకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే, ఆ ఒక్కరోజు దీపం వెలిగించినా ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుందట. కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు దీపాలను వెలిగిస్తూ భూమిపైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి, పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన, ముఖ్యంగా 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల ఈ జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయట.

‎సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందట. కాగా దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి, దానధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి, భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, సంపద కలుగుతాయట. ‎ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినట్లే అని ఈ దీపాలను చూసినవారి పాపాలు పటాపంచలై, జీవితానంతరం వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి, కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్ఠం అని చెబుతున్నారు.

Exit mobile version