సాధారణంగా చాలా ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించినప్పుడు ఒక విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారితో సహాస్వామివారు వెలసిన ఆలయాల్లో ఆయనకు ఎడమవైపున అమ్మవారు కొలుదీరి ఉంటారు. అలాగే దైవ సంబంధిత కార్యక్రమాల్లోనూ…శుభాకార్యాల్లోనూ భార్యభర్తలు…భర్తకు ఎడమవైపు మాత్రమే భార్య ఉండాలని పెద్దలు అంటుంటారు. భార్యాభర్తలు ఫొటో దిగుతున్నా…మామూలుగా కూర్చున్నా ఈ విషయాన్ని మాత్రం అస్సలు మరిచిపోరు. అంతగా ఈ ఆచారం భారతీయుల జీవన విధానంతో ముడిపడిపోయింది.
కానీ మన పూర్వీకులు ఏ పనిచేసినా…దానికో అర్థం ఉంటుంది. పరమార్థం తప్పకుండా ఉంటుంది. ఇదే విషయం మరోసారి స్పష్టమవుతుంది. శరీరంలో కుడిభాగాన్ని సవ్య భాగమనీ…ఎడమ భాగాన్ని అపసవ్య భాగమని అంటారు. కుడిభాగానికి ఉండే శక్తి సామర్థ్యాలు ఎడమ భాగానికి ఉండవు. అందుకే ఎప్పటికప్పుడు ఎడమ భాగానికి అదనపు శక్తి అవసరం అవుతుంది. కుడి భాగాన్ని శివుడికి సంకేతంగా భావిస్తారు. ఎడమభాగాన్ని శక్తికి సంకేతంగా చెబుతుంటారు. ఈ కుడి ఎడమల కలయికనే అర్థనారీశ్శర రూపం అంటారు.
శరీరంలో ఎడమ భాగం శక్తి భాగం కాబట్టి…భర్తకి ఎడమవైపునే భార్య ఉండాలనే నియమాన్ని విధించారు. ఈ ఆచారాన్ని పాటించడం వల్ల ఆలోచన, ఆచరణ ఈ రెండూ కూడా సమపాళ్లుగా కలిసి జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని విశ్వసిస్తుంటారు.